డ్రైవర్ల యూనియన్ బంద్ పిలుపు.. హైదరాబాద్‌లో నిలిచిపోయిన ఆటోలు…

డ్రైవర్ల యూనియన్ బంద్ పిలుపు.. హైదరాబాద్‌లో నిలిచిపోయిన ఆటోలు… క్యాబ్‌లు, లారీలు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ!

  • మోటారు వాహనాల చట్టం 2019 అమలును వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • నేడు ట్రాన్స్‌పోర్టు భవన్ ముట్టడికి డ్రైవర్ల జేఏసీ పిలుపు
  • రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టం 2019 అమలును తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్ల యూనియన్ జేఏసీ ఇచ్చిన ఒక్క రోజు బంద్‌ పిలుపుతో గత అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవలు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ వెంకటేశం మాట్లాడుతూ.. పెరిగిన పెట్రో ధరలతో ఇప్పటికే అవస్థలు పడుతున్న తమపై అదనపు భారం సరికాదన్నారు. జరిమానాల పేరుతో ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లను ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో నేడు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్రాన్స్‌పోర్టు భవన్ వరకు భారీగా తరలివెళ్లి నిరసన తెలుపుతామన్నారు. కాగా, ఈ బంద్‌లో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఐఎఫ్, క్యాబ్, ఆటో, లారీ సంఘాలు పాల్గొంటున్నాయి.

మరోవైపు, ఆటోలు, క్యాబ్ సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత అర్ధరాత్రి నుంచి ముఖ్యమైన మార్గాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బస్సులు అవసరమైనవారు 99592 26160, 99592 26154 నంబర్లకు ఫోన్ చేయాలని గ్రేటర్ జోన్ ఈడీ యాదగిరి తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: