ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు! ధర రూ.1,108 కోట్ల

రూ.1,108 కోట్లకు అమ్ముడుపోయిన కారు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు!

  • సోతెబీ వేలంలో దక్కించుకున్న వ్యక్తి
  • వచ్చిన డబ్బుతో మెర్సిడిస్ బెంజ్ ఫండ్ సృష్టి
  • దాని ద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్

ఒక కారు ధర మహా అయితే ఎంత ఉంటుంది? ఓ సాధారణ ఎగువ మధ్యతరగతి వ్యక్తి నడిపేదైతే మహా అయితే రూ.10 లక్షలు! అదే కొంచెం డబ్బున్న వాళ్లు కొనేదైతే ఓ రూ.50 లక్షలు! అత్యంత సంపన్నులు, కుబేరుల దగ్గర ఉండేవైతే.. రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల ధర పలుకుతాయేమో! కానీ, ఇదిగో ఈ కారు ధరే అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

ఒకటి కాదు.. రెండు కాదుసుమా.. ఈ కారు ధర అక్షరాలా రూ.1,108 కోట్లు. అవును అక్షరాలా ఇది నిజం. ఆ ధర వెనుక ఓ మంచి ఉద్దేశం ఉంది. కెనడాలోని ఆర్ఎం సోతెబీ అనే సంస్థ మే 5న 1955 నాటి వింటేజ్ మెర్సిడిస్ బెంజ్ క్లాసిక్ 300 ఎస్ఎల్ఆర్ అలెన్హాట్ కూప్ కు వేలం నిర్వహించింది. ఆ వేలంలో ఓ వ్యక్తి దానిని 13.5 కోట్ల యూరోల (సుమారు రూ.1,108 కోట్లు) కు పాడుకున్నాడు.

వేలంలో వచ్చిన డబ్బుతో ‘మెర్సిడిస్ బెంజ్ ఫండ్’ పేరిట ఓ ఖాతా తెరచి.. పేద, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎన్విరాన్మెంటల్ సైన్స్, కర్బన ఉద్గారాల తగ్గింపు మీద చేసే పరిశోధనలకుగానూ స్కాలర్ షిప్ అందించనున్నారు. కాగా, 3.0 లీటర్ ఇంజన్ తో ఉండే ఈ కారును గ్రాండ్ ప్రీ రేసింగ్ కోసం అప్పట్లో తయారు చేశారు. అంతేకాదు.. ఈ కారుతోనే జువాన్ మాన్యుయల్ ఫాంజియో రెండు సార్లు వరల్డ్ చాంపియన్ షిప్ ను సాధించాడు. గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ఈ కారు దూసుకెళ్తుంది.

వాస్తవానికి ప్రస్తుతం ప్రపంచంలో ఇవి రెండే కార్లున్నాయి. బెంజ్ స్టట్గార్ట్ మ్యూజియంలో వాటిని ప్రదర్శనకు ఉంచారు. అయితే, ఇప్పుడు ఒక కారును వేలం వేయడంతో ఇంకో కారు మాత్రమే మిగిలి ఉంది. కారును సొంతం చేసుకున్న వ్యక్తి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కారును మ్యూజియంలో ప్రదర్శించేందుకు అంగీకరించారు. ఇక, రెండో కారును ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మేది లేదని బెంజ్ స్పష్టం చేసింది. అది ఎప్పటికీ మ్యూజియంలోనే ఉంటుందని తెలిపింది.

Leave a Reply

%d bloggers like this: