అన్న భార్యపై కవల సోదరుడి అఘాయిత్యం.. భర్తనని నమ్మించి నెలల తరబడి అత్యాచారం!

అన్న భార్యపై కవల సోదరుడి అఘాయిత్యం.. భర్తనని నమ్మించి నెలల తరబడి అత్యాచారం!
-మహారాష్ట్రలోని లాతూరులో ఘటన
-రూపురేఖలు ఒకేలా ఉండడంతో భర్తేనని భ్రమపడిన బాధితురాలు
-ఆ సంబంధాన్నే కొనసాగించాలన్న భర్త
-పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

అచ్చం అన్నలా ఉన్న కవల సోదరుడు తన రూపు రేఖలను వాడుకుని దుర్మార్గానికి పాల్పడ్డాడు. వదిన తనను గుర్తించలేకపోవడంతో ఆమెపై నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి పాపం పండడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రస్తుతం ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. మహారాష్ట్రలోని లాతూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఓ కుటుంబంలోని అన్నాదమ్ములు ఇద్దరు కవలలు. వీరిలో అన్నకు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది.

సోదరులిద్దరూ కవలలు కావడం, ఆహార్యం, శరీర సౌష్టవం ఒకేలా ఉండడంతో వారిలో ఎవరు ఎవరో గుర్తించడం కష్టంగా ఉండేది. దీనిని సొమ్ము చేసుకున్న తమ్ముడు.. అన్న భార్యపై అఘాయిత్యానికి పాల్పడడం మొదలుపెట్టాడు. అన్న లేని సమయంలో ఆమె గదిలోకి ప్రవేశించి భర్తలా ప్రవర్తించి లైంగిక వాంఛలు తీర్చుకోసాగాడు. అన్నదమ్ములిద్దరూ ఒకే పోలికలతో ఉండడంతో ఆమె కూడా తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని గుర్తించలేకపోయింది.

ఆరు నెలల తర్వాత ఆమెకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. అయితే, ఇక్కడే మరో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి భర్తకు చెప్పగా అతడు చెప్పింది విని ఆమె షాకైంది. ఆ సంబంధాన్ని అలాగే కొనసాగించాలంటూ అతడు చెప్పిన మాటలు ఆమెను నిర్ఘాంతపరిచాయి. అత్తింటి వారు కూడా అతడినే సమర్థించడంతో బాధితురాలు సహించలేకపోయింది. అన్నదమ్ములిద్దరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికి అరదండాలు వేశారు.

Leave a Reply

%d bloggers like this: