Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

“ఇంటికి పోయి వంట చేసుకో”… ఎంపీ సుప్రియా సూలేపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్

“ఇంటికి పోయి వంట చేసుకో”… ఎంపీ సుప్రియా సూలేపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్

  • మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లపై విమర్శల పర్వం
  • బీజేపీ నాయకత్వంపై వ్యాఖ్యలు చేసిన సుప్రియా సూలే
  • ఘాటుగా స్పందించిన చంద్రకాంత్ పాటిల్

మహారాష్ట్ర రాజకీయాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. తాజాగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఓ నిరసన కార్యక్రమం సందర్భంగా చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ, “నీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికి వెళ్లి వంట చేసుకో” అంటూ సుప్రియా సూలేకి సూచించారు. ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ, ఎన్సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి.

ఇటీవల సుప్రియా సూలే బీజేపీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్ కోసం పోరాటాన్ని మధ్యప్రదేశ్ తో పోల్చిన ఆమె… “మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి ఎవరినో కలిశారు. అయితే ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, రెండ్రోజుల తర్వాత ఓబీసీ రిజర్వేషన్లకు వారికి ఆమోదం లభించింది” అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే చంద్రకాంత్ పాటిల్ పైవిధంగా స్పందించారు. “ఇక నువ్వు రాజకీయాల్లో ఎందుకు? హాయిగా ఇంటిపట్టునే ఉండు. ఢిల్లీ వెళతావో వల్లకాటికి వెళతావో నీ ఇష్టం. మాకు ఓబీసీ కోటా కావాలి. లోక్ సభ సభ్యురాలిగా ఉన్నావు… ఓ చీఫ్ మినిస్టర్ తో అపాయింట్ మెంట్ ఎలా లభిస్తుందో కూడా నీకు తెలియదా?” అంటూ ఎత్తిపొడిచారు.

కాగా, సెక్సిస్ట్ వ్యాఖ్యల నేపథ్యంలో తనపై విమర్శలు రావడంతో చంద్రకాంత్ పాటిల్ వివరణ ఇచ్చారు. మహిళలను గౌరవించడం అనేది తన స్వభావంలోనే ఉందని, గ్రామీణ ప్రాంతాలకు పోయి అక్కడివారిని అర్థం చేసుకోవాలని, అక్కడివారు కూడా ఇలాగే మాట్లాడతారన్న విషయాన్ని సూలే తెలుసుకోవాలన్నది తన అభిమతమని తెలిపారు.

అయితే, ఎన్సీపీ కూడా పాటిల్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చింది. పాటిల్ చపాతీలు చేయడం ఎలాగో నేర్చుకోవాలని, తద్వారా వంటగదిలో భార్యకు సాయపడవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్ కోటా కోసం శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాడీ ప్రభుత్వం తగిన పోరాటం చేయడంలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఓబీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగా… కేంద్రం ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి తగిన సమాచారం అందించడం లేదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తోంది.

Related posts

లండన్ లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్ లో రచ్చ!

Drukpadam

అవినీతిపరులంతా ఒక్కటవుతున్నారు.. మా పద్ధతి మారదు: విపక్ష నేతలపై మోదీ ఫైర్!

Drukpadam

తెలంగాణను మళ్లీ ఏపీలో చేర్చేందుకు మోదీ కుట్ర: హరీశ్ రావు

Drukpadam

Leave a Comment