మా మార్కాపురం మిత్రుడంటూ.. ‘మన్ కీ బాత్’లో తెలుగు వ్యక్తిని ప్రస్తావించిన ప్రధాని మోదీ

  • బాలికల విద్య కోసం రిటైర్మెంట్ డబ్బు వినియోగం
  • వంద మంది పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు
  • రూ.25 లక్షల దాకా జమచేసిన రాం భూపాల్ రెడ్డి
  • ఆయన మంచి తనాన్ని మెచ్చుకున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా నిర్వహించిన మన్ కీ బాత్ లో ఏపీకి చెందిన వ్యక్తి పేరును ప్రస్తావించారు. సుకన్య సమృద్ధి యోజన గురించి మాట్లాడుతూ మార్కాపురానికి చెందిన రాం భూపాల్ రెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగిని గుర్తు చేసుకున్నారు. పదవీ విరమణ తర్వాత తన ఆదాయం మొత్తాన్ని బాలికల విద్య కోసం ఆ మిత్రుడు ఖర్చు పెట్టాడని తెలిసిందన్నారు. 

ఈ విషయం ప్రతి ఒక్కరూ గర్వించదగిన విషయమని చెప్పారు. ఇప్పటిదాకా వంద మందికి సుకన్య సమృద్ధి యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్లు తెరచి వారి పేరిట రూ.25 లక్షలకుపైగా జమ చేశారని మోదీ ప్రశంసించారు. స్వలాభం కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేయడం మన సంస్కృతిలో అంతర్భాగమన్న విషయాన్ని ఆయన నిరూపించారన్నారు.  

కాగా, మన్ కీ బాత్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ యూనికార్న్ ల(వంద కోట్ల డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు)కుపైన ఆదాయం ఉండే స్టార్టప్ లు)అభివృద్ధి గురించి మాట్లాడారు. ఈ నెల ఐదో తేదీ నాటికి దేశంలో యూనికార్న్ ల సంఖ్య 100కు చేరిందన్నారు. వాటి విలువ 35 వేల కోట్ల డాలర్లని (రూ.25 లక్షల కోట్లకుపైగానే) చెప్పారు. గత ఏడాదే 44 యూనికార్న్ లు కొత్తగా వెలిశాయన్నారు. 

కరోనా మహమ్మారి సమయంలోనూ మన అంకుర సంస్థలు ఆదాయాన్ని సృష్టిస్తున్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. అమెరికా, ఇంగ్లండ్ ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలోనే యూనికార్న్ పరిశ్రమల అభివృద్ధి ఎక్కువగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. నవభారత నిర్మాణంలో భాగంగా నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ పారిశ్రామికవేత్తలు అంకుర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. 

అంకుర పరిశ్రమల అభివృద్ధికి చాలా మంది దోహదపడుతున్నారని చెప్పిన మోదీ.. పద్మ శ్రీ అవార్డు గ్రహీత శ్రీధర్ వెంబూను గుర్తుచేసుకున్నారు. ఆయన స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన ఆయన.. సాటి పారిశ్రామికవేత్తలకూ తోడ్పాటునందిస్తున్నారని ప్రశంసించారు. గ్రామాలనే తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారని చెప్పారు. ఒన్ బ్రిడ్జి వంటి వేదికల ద్వారా మదన్ పడాకీ అనే వ్యక్తి కూడా గ్రామీణ యువతను ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు.

స్వయం సహాయక బృందాలు తయారు చేసే ఉత్పత్తులను ఎక్కువగా వినియోగంలోకి తేవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీని వల్ల మహిళల సాధికారత పెరుగుతుందన్నారు. తద్వారా ఆత్మ నిర్భర్ భారత్ కల కూడా వేగంగా సాకారమవుతుందని చెప్పారు. 

కాగా, మన దేశం అనేక భాషలు, లిపులు, మాండలికాల సముదాయం అని మోదీ అన్నారు. భిన్న వేషధారణలు, ఆహారపుటలవాట్లు, సంస్కృతే మనకు గుర్తింపన్నారు. ఆ వైవిధ్యత ఓ దేశంగా మారినప్పుడు మనల్ని మరింత బలోపేతం చేస్తుందని, ఐక్యం చేస్తుందని చెప్పారు. ఈ విషయం గురించి చెబుతూ ఉత్తరాఖండ్ జోషిమఠ్ కు చెందిన చూపులేని కల్పన అనే ఓ అమ్మాయి పేరును ప్రస్తావించారు. 

ఆమెకు చూపులేకపోయినా..కన్నడ రాకపోయినా కర్ణాటకలో ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి 92 శాతం మార్కులు తెచ్చుకుందని మెచ్చుకున్నారు. మూడో తరగతిలోనే కంటి చూపు పోయినా మనసుంటే మార్గముంటుందన్న ఆలోచనతో ముందుకెళ్లిందని గుర్తు చేశారు. మైసూరులో నివసించే ప్రొఫెసర్ తారామూర్తితో ఏర్పడిన పరిచయంతో ఆమె కన్నడలో రాటు దేలిందని, మూడు నెలల్లోనే భాషపై పట్టుసాధించిందని చెప్పారు. 

కల్పనలాగానే చాలా మంది దేశంలో భాషా వైవిధ్యాన్ని సుసంపన్నం చేస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. మరోవైపు చార్ ధాం యాత్రలో భక్తులు చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని, ఓ పర్యటనకు వెళ్లినప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం భక్తులకు ఉందని మోదీ సూచించారు. అందరూ స్వచ్ఛతను పాటిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్నీ పెట్టుకోవాలని సూచించారు. 

వచ్చే నెల 21న 8వ యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నామని, ‘మానవాళి శ్రేయస్సు కోసం యోగా’ అనే థీమ్ తో ఈసారి యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.అనేక సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టబోతున్నారని, ‘గార్డిన్ రింగ్’ పేరిట ఓ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేశారని మోదీ వివరించారు. అంటే సూర్యుడి గమనం ఆధారంగా యోగాను జరుపుకోబోతున్నారని పేర్కొన్నారు. సూర్యుడి ప్రయాణ మార్గానికి తగ్గట్టుగా ఆయా దేశాల్లో యోగా నిర్వహిస్తారన్నారు.

Leave a Reply

%d bloggers like this: