అమెరికాలో పారాసెయిలింగ్ చేస్తూ ఏపీ మహిళ మృతి!

అమెరికాలో పారాసెయిలింగ్ చేస్తూ ఏపీ మహిళ మృతి

  • ఫ్లోరిడాలో బోట్ పారాచ్యూట్ లో విహరిస్తుండగా ప్రమాదం
  • వంతెనకు తగిలిన పారాచ్యూట్
  • తీవ్ర గాయాలతో మరణించిన సుప్రజ
  • తేలికపాటి గాయాలతో బయటపడిన తనయుడు  

అమెరికాలో జరిగిన పారాసెయిలింగ్ ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ మహిళ మృతి చెందింది. ఆమె పేరు సుప్రజ. వయసు 34 సంవత్సరాలు. సుప్రజ, ఆలపర్తి శ్రీనివాసరావు భార్యాభర్తలు. బాపట్ల జిల్లాలోని చింతపల్లిపాడు (మార్టూరు మండలం) వీరి స్వస్థలం. 2012లో అమెరికా వెళ్లిన శ్రీనివాసరావు షికాగోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం కిందట వీరి కుటుంబం ఫ్లోరిడాకు మారింది.

కాగా, ఇతర కుటుంబాలతో కలిసి సుప్రజ, శ్రీనివాసరావు కుటుంబం విహారయాత్రకు వెళ్లగా, అది విషాదాంతంగా మారింది. తమ పిల్లలు అక్షత్ చౌదరి (10), శ్రీ అధిరా (6)లను కూడా విహారయాత్రకు తీసుకెళ్లారు. అయితే, కుమారుడు అక్షత్ తో కలిసి సుప్రజ బోట్ పారాసెయిలింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారింది.

బలమైన గాలులు వీయడంతో ఆ పారాచ్యూట్ ను బోటుకు అనుసంధానించిన తాళ్లు తెగిపోయాయి. దాంతో, ఆ పారాచ్యూట్ ఓ వంతెనకు బలంగా తగలడంతో ప్రమాదం సంభవించింది. తీవ్రగాయాలపాలైన సుప్రజ ప్రాణాలు విడవగా, కుమారుడు అక్షత్ కు తేలికపాటి గాయాలయ్యాయి. సుప్రజ మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Leave a Reply

%d bloggers like this: