జీఎస్టీ వసూళ్లలో ఏపీ స‌త్తా!… జాతీయ స‌గ‌టును మించి వృద్ధి!

జీఎస్టీ వసూళ్లలో ఏపీ స‌త్తా!… జాతీయ స‌గ‌టును మించి వృద్ధి!

  • మే నెల‌లో దేశీయ జీఎస్టీ వ‌సూళ్లు రూ.1,40,885 కోట్లు
  • గ‌తేడాది మేతో పోలిస్తే 44 శాతం వృద్ధి న‌మోదు
  • ఏపీలో 47 శాతం మేర పెరిగిన జీఎస్టీ వ‌సూళ్లు
  • తెలంగాణ‌లో జీఎస్టీ వృద్ధి శాతం 33 శాత‌మే

జీఎస్టీ వ‌సూళ్ల‌లో ఏపీ స‌త్తా చాటుతోంది. ఏటికేడు జీఎస్టీ వ‌సూళ్ల‌లో భారీ వృద్ధి న‌మోదు చేస్తూ సాగుతున్న ఏపీ.. మే నెల జీఎస్టీ వ‌సూళ్ల‌లో జాతీయ స‌గ‌టును మించి వృద్ధి న‌మోదు చేసింది. అదే స‌మ‌యంలో తెలంగాణ జీఎస్టీ వ‌సూళ్ల‌లో న‌మోదైన వృద్ధిని కూడా ఏపీ అధిగ‌మించింది. మంగ‌ళ‌వారంతో ముగిసిన మే నెల‌కు సంబంధించిన జీఎస్టీ వ‌సూళ్ల వివ‌రాల‌ను కేంద్రం బుధ‌వారం విడుద‌ల చేసింది.

మే నెల‌లో ఏపీలో జీఎస్టీ ప‌న్నుల వ‌సూళ్లు రూ.3,047 కోట్లుగా తేలింది. గ‌తేడాది ఇదే నెల‌లో రూ.2,074 కోట్లు వ‌సూల‌య్యాయి. ఈ లెక్క‌న ఏడాది తిర‌క్కుండానే మే నెల‌ జీఎస్టీ వ‌సూళ్ల‌లో ఏపీలో దాదాపుగా రూ.1,000 కోట్ల మేర వృద్ధి న‌మోదైంది. వెర‌సి వృద్ధి శాతం 47గా న‌మోదు అయ్యింది. ఇక తెలంగాణ‌లో మే నెల జీఎస్టీ వ‌సూళ్లు రూ.3,982 కోట్లుగా తేలింది. గ‌తేడాది ఇదే మాసంలో తెలంగాణ‌లో రూ.2,984 కోట్లు మాత్ర‌మే వ‌సూల‌య్యాయి. ఈ లెక్క‌న తెలంగాణ‌లో మే నెల‌కు సంబంధించిన జీఎస్టీ వ‌సూళ్ల‌లో 33 శాతం వృద్ధి న‌మోదైంది. వ‌సూలైన ప‌న్నుల ప‌రంగా చూస్తే తెలంగాణ కంటే దిగువ స్థానంలోనే ఉన్నా… వృద్ధి శాతంలో మాత్రం తెలంగాణ‌ను ఏపీ దాటేసింది.

ఇదిలా ఉంటే… దేశం మొత్తం మీద మే నెల‌లో రూ.1,40,885 కోట్ల మేర జీఎస్టీ వ‌సూలైంది. అంత‌కుముందు నెల ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ ప‌న్ను వ‌సూళ్ల‌లో భారీ త‌గ్గుద‌ల న‌మోదైంది. ఏప్రిల్ నెల‌లో రూ.1.68 ల‌క్ష‌ల కోట్ల జీఎస్టీ వసూలైన సంగ‌తి తెలిసిందే. గ‌త నెల‌తో పోలిస్తే జీఎస్టీ వ‌సూళ్లు త‌గ్గినా…గ‌తేడాది మే నెల‌తో పోలిస్తే జీఎస్టీ వ‌సూళ్లు పెరిగాయ‌నే చెప్పాలి. గ‌తేడాది మే నెల‌లో రూ.97,821 కోట్లు మాత్రమే వ‌సూల‌య్యాయి. ఈ లెక్క‌న మే నెల‌లో జీఎస్టీ వ‌సూళ్ల‌లో 44 శాతం వృద్ధి న‌మోదైంది. దేశీయ జీఎస్టీ వృద్ధి శాతం 44 శాతం కంటే కూడా ఏపీలో 47 శాతం వృద్ధి న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

Leave a Reply

%d bloggers like this: