సోనియా, రాహుల్ గాంధీల‌కు ఈడీ స‌మ‌న్లు!

సోనియా, రాహుల్ గాంధీల‌కు ఈడీ స‌మ‌న్లు!
-నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఈడీ చ‌ర్య‌
-ఈ వ్య‌వ‌హారంపై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఫిర్యాదు
-గ‌తంలో పాటియాలా హౌజ్ కోర్టుకు హాజ‌రైన సోనియా, రాహుల్‌

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు, రాయ‌బ‌రేలీ (ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌) ఎంపీ సోనియా గాంధీ, మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ (కేర‌ళ‌) ఎంపీ రాహుల్ గాంధీల‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బుధ‌వారం స‌మ‌న్లు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని నేష‌న‌ల్ హెరాల్డ్ వ్య‌వ‌హారానికి సంబంధించిన విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని, ఈ కేసులో రేపు (గురువారం) త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని రాహుల్ గాంధీని ఈడీ ఆదేశించింది. అదే సమయంలో ఈ నెల 8న తమ ముందు విచారణకు హాజరుకావాలని సోనియా గాంధీని ఆ సంస్థ కోరింది.

నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో న‌డిచింది. ప్ర‌స్తుతం ఈ ప‌త్రిక‌ను పార్టీ మూసేసింది. అయితే ఈ సంస్థ‌కు దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌హా ప‌లు ఇత‌ర ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని రాహుల్ గాంధీ త‌న ఖాతాలో వేసుకున్నార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

ఈ వ్య‌వ‌హారంపై గ‌తంలో బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా… త‌మ జీవిత కాలంలోనే తొలిసారి సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఇదే వ్య‌వ‌హారంలో వారిద్ద‌రికీ ఈడీ స‌మ‌న్లు జారీ చేయ‌డం, విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Leave a Reply

%d bloggers like this: