జర్నలిస్టులకు అక్రిడేషన్ కష్టాలు … కార్డుల జారీలో అనేక అడ్డంకులు …

జర్నలిస్టులకు అక్రిడేషన్ కష్టాలు … కార్డుల జారీలో అనేక అడ్డంకులు …
-ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు
-8 సంవత్సరాల్లో 3 సార్లు మాత్రమే అక్రిడేషన్ కార్డులు జారీ
-ఇక ఇల్లు ,ఇళ్ల స్థలాల వ్యవహారంలో ఎదురుచూపులు
-మార్చి లో శుభవార్త వింటారన్న సీఎం …జూన్ నెల వచ్చిన శుభవార్త లేదు  …
-హెల్త్ కార్డు ల విషయంలో కార్డులు ఉన్నా అందని వైద్యం …
-ఇది మనరాష్ట్రం మనపాలనలో జర్నలిస్ట్ లకు జరుగుతున్న న్యాయం

రాజ్యంగంలో లిఖితపూర్వకంగా లేనప్పటికీ జర్నలిస్ట్ ఫోర్త్ ఎస్టేట్ గా గుర్తింపు బడ్డారు .ఆరకంగా గౌరవం ఒకప్పుడు మంచి గుర్తింపు గౌరవం లభించేది . నేడు అది కొరవడింది. ప్రత్యేకంగా తెలంగాణ లో జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు . ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి . తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన వర్గాలలో జర్నలిస్టులు కూడా ప్రధాన భూమిక నిర్వహించారు . ప్రత్యేక రాష్ట్రం వస్తే మరిన్ని సౌకర్యాలు లభిస్తాయని భావించారు . కానీ ఉన్నా సౌకర్యాలు ఊడిపోతాయని అనుకోలేదు .. కానీ తెలంగాణాలో జరుగుతున్నది అదే ….

ప్రధానంగా ఇల్లు ,ఇళ్ల స్థలాలు , అక్రిడేషన్ కార్డులు , హెల్త్ కార్డుల విషయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు . ఈ విషయంలో జర్నలిస్టులు. జర్నలిస్ట్ సంఘాలు అనేక సందర్భాలలో తమ నిరసనలు వ్యక్తం చేశారు . నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కలిసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోని వచ్చి పరిష్కరించుకుందామని అనుకుంటే ,ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వరు . ప్రతిరాష్ట్రంలో సమాచార శాఖకు మంత్రి ఉండగా మనరాష్ట్రంలో ఆ శాఖకు మంత్రి కూడా లేరు . ముఖ్యమంత్రివద్దే ఆశాఖ ఉంది. ఆయన అపాయింట్మెంట్ దొరకదు … సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాకా జర్నలిస్టు సంఘాలు సతమత మౌతున్నాయి .

ప్రధానంగా అక్రిడేషన్ సీజన్ వచ్చింది. దానికోసం అనేక కష్టాలు పడాల్సి వస్తుంది…. ప్రతి జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డు పొందాలని కోరుకుంటారు . ఉమ్మడి రాష్ట్రంలో చాల తేలిగ్గా పొందిన అక్రిడేషన్ కార్డులకు ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. గతంలో జర్నలిస్ట్ గా పని చేస్తున్న ప్రతి వ్యక్తి కార్డు పొందేందుకు తాను పనిచేస్తున్నట్లు ఆధారాలు సమర్పిస్తే సరిపోయేది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ అనేక కొర్రీలు పెడుతుంది .దీంతో కార్డుల జారీలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతున్నారు . జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోని వాటిని పరిష్కరించే బదులు, నిబంధలు పేరుతొ కఠినంగా వ్యవహరించడంపై జర్నలిస్టులు ,జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. అనేక వ్యయ ప్రయాసలకోర్చి లిస్టులో పేరు తెచుకున్నప్పటికీ కార్డు వస్తుందో రాదో అనే ఆందోళన లో జర్నలిస్టులు ఉన్నారు .

ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చుపెట్టి కార్డులు పొందేందుకు జర్నలిస్టులు నానా యాతన పడుతున్నారు. ఇదే ఛాన్స్ గా మీడియా యాజమాన్యాలు కార్డు కు ఇంత ఇస్తేనే మీపేరు లిస్ట్ లో ఉంటుందని నిస్సిగ్గుగా చెబుతున్నాయి. దీంతో కార్డు పొందేందుకు చేసేది లేక యాజమాన్యాలు అడిగినంత సమర్పించుకోవడం సర్వసాధారణమైంది .దీంతో కార్డు పొందేందుకు వడ్డీకి తెచ్చి ఇచ్చేవారు , బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునేవారు ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు . ఈ వృత్తిలోకి వచ్చేవారిలో అత్యధికులు సామాన్య, పేద మధ్యతరగతి కుటుంబాల అత్యధికులు. వారిపట్ల యాజమాన్యాలు కఠినంగా వ్యవరిస్తున్నాయంటే అందుకు ప్రభుత్వానిదే బాధ్యత ….

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందరిలాగా తమ బతుకులు బాగుపడతాయని జర్నలిస్టులు భావించారు రాష్ట్ర ఏర్పాటులో యాజమాన్యాల ఆటంకాలు కలిగించినప్పటికీ ఉద్యమం లో తమ వంతు పాత్ర నిర్వహించారు . వీపులు పగల గొట్టించుకున్నారు . కెమెరా లు ధ్వంసమయ్యాయి .ఎన్ని ఆటంకాలు ఎదురైనా రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమానికి బాసటగా జర్నలిస్టుల నిలిచారు. కానీ జర్నలిస్టులు కోరుకున్న విధంగా సంక్షేమం వైపు ప్రభుత్వం చూడలేదు. 2014 లో ఒక జర్నలిస్టు సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ ఆర్ (అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి కాలేదు ) అందరికీ అక్రిడేషన్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని గర్జించారు. ఆఫీస్ లో పనిచేసే ఆఫీస్ బాయ్ కూడా జర్నలిస్టే అని వాళ్లకు కూడా అక్రిడేషన్ లు ఉండాల్సిందేనని అన్నారు . (ఆయన మాటలకూ చప్పట్లే చప్పట్లు) జర్నలిస్టులందరికీ ఉచిత వైద్యం అందాలని , ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కేసీఆర్ అన్నారు .

2014 టీఆర్ యస్ ఎన్నికల ప్రణాళికలో కూడా జర్నలిస్టుల ఇళ్లస్థలాలు , అక్రిడేషన్ కార్డులు , ఉచిత వైద్యం గురించి పెట్టారు . కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ వాటిని పట్టించుకోలేదు . ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ,వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్ పర్యటనలలో జర్నలిస్టులకు అందమైన కాలనీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డబల్ బెడ్ రూమ్ కాకుండా త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించే బాధ్యత తనదే అన్నారు. హైదరాబాద్ నుంచి ఆర్కిటెక్చర్ ను పంపి ఇస్తామన్నారు .జర్నలిస్టుల కాలనీల్లో విస్తారంగా రోడ్లు, అందమైన పార్కు, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ లైబ్రరీ ఉండాలన్నారు. 2015 బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు కావాల్సిన నిధులు పెట్టుకుందామని తీపి కబుర్లు చెప్పారు. అందుకు జర్నలిస్టులంతా మురిసి పోయారు, ఉబ్బితబ్బిబ్బయ్యారు ఇలాంటి ముఖ్యమంత్రి దొరకటం అదృష్టంగా భావించారు. ఎనిమిది సంవత్సరాలు గడిచింది ఇప్పటికీ అందమైన కాలనీలు ఏర్పాటు కాలేదు. చివరకు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జర్నలిస్టులందరికీ ఒకే చోట కాలనీ ఏర్పాటు చేస్తానని జర్నలిస్టు సంఘాల నేతలతో చెప్పారు. అందుకనుగుణంగా హైదరాబాద్, రంగారెడ్డి కలక్టర్ల కు జర్నలిస్టులకు తగిన భూములు చూడాలన్నారు . సీఎం ఆదేశాలకు అనుగుణంగా జర్నలిస్ట్ సంఘాల నేతలను తీసుకొని కావలసిన ల్యాండ్ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల వెతికి ఒక స్థలం చూసి ఒకే అనుకున్నారు . ఏమి జరిగిందో ఏమిటో తెలియదు . ఇంతవరకు దాని అజాపజా లేదు .

మొన్న మార్చిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్య మార్చి నెల చివర్లో పరిష్కారమవుతుందని, తొందర్లోనే శుభవార్త వింటారని అన్నారు . మూడు నెలలు గడిచింది శుభవార్త వినలేదు.దీంతో జర్నలిస్టు లోకంలో అయోమయం నెలకొన్నది .ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయడం లేదు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లిన జర్నలిస్ట్ హెల్త్ కార్డు చుస్తే మెట్లు కూడా ఎక్కనివ్వడంలేదు . సకాలంలో వైద్యం అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీనిపై ఢిల్లీలో టీయూ డబ్ల్యూ జె (ఐజేయూ ) ఆధ్వరంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలసిన నేతలు తెలంగాణాలో జర్నలిస్టులకు వైద్యం అందని విషయాన్నీ ఆయన దృష్టికి తెచ్చారు . ఆయన స్పందించారు . రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు . కానీ రాష్ట్ర పాలకులు కదిలిన పాపాన పోలేదు . పొరుగు రాష్ట్రాల్లో రైతులు చనిపోతే అక్కడకు వెళ్లి డబ్బులు ఇస్తున్న మన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జర్నలిస్టులను ఆదుకోవడంలేదనే  కోపం జర్నలిస్ట్ సమాజంలో ఉంది. ఇది మన రాష్ట్రంలో మన జర్నలిస్టులకు జరుగుతున్న న్యాయం …ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ స్పందించి జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తుందో లేదో చూద్దాం ….!

Leave a Reply

%d bloggers like this: