ఖమ్మం జిల్లాలో విషాదం: 4న పెళ్లి, 5న రిసెప్షన్.. 6న నవ వరుడి ఆత్మహత్య!

ఖమ్మం జిల్లాలో విషాదం: 4న పెళ్లి, 5న రిసెప్షన్.. 6న నవ వరుడి ఆత్మహత్య!
-ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడుకు చెందిన యువతితో 4న వివాహం
-6న గుణదల దర్శనానికి వెళ్లేందుకు కార్లు కూడా మాట్లాడిన వరుడు
-ఉదయాన్నే లేచి బంధువులను నిద్రలేపి ప్రయాణానికి సిద్ధం చేసిన వైనం
-స్నానం చేసి వస్తానంటూ బ్లేడుతో గొంతు, చేయి కోసుకుని ఆత్మహత్య

ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం లో నవవరుడు ఆత్మహత్య మిస్టరీగా మారింది….పెళ్లయిన మూడురోజుల ముచ్చట తీరకుండానే వరుడి ఆత్మహత్య కుటుంబంలో విషాదాన్ని నింపింది. వరుడు ఇంతటి దారుణానికి పాల్పడటానికి కారణం ఏమిటనేదానిపై పోలీసులు కేసునమోదు చేసి ఆరా తీస్తున్నారు .

ఖమ్మం జిల్లాలో పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. పెళ్లి, రిసెప్షన్ అయిన తర్వాత నవవరుడు ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. జిల్లాలోని వైరా మండలం పుణ్యవరంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేష్ (29)కు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడు గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 4న వివాహమైంది. ఆ తర్వాతి రోజైన ఆదివారం వరుడి స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో నరేష్ ఆనందంగానే కనిపించాడు. స్నేహితులతో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు.

నిన్న అందరూ కలిసి విజయవాడ సమీపంలోని గుణదల దైవదర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం నరేష్ కార్లు కూడా మాట్లాడాడు. తెల్లవారుజామున మూడు గంటలకే లేచి అందరినీ నిద్రలేపి ప్రయాణానికి సిద్ధం చేశాడు. ఆపై స్నానం చేసి వస్తానంటూ గదిలోకి వెళ్లాడు. అలా వెళ్లిన నరేష్ ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. అతడికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాత్రూం తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి వున్న నరేష్‌ను చూసి హతాశులయ్యారు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకోవడంతో అతడు మరణించినట్టు నిర్ధారించారు.

ఆరేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేసిన నరేష్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మరోవైపు, గ్రూప్స్‌కు శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. పెళ్లి రోజు, ఆ తర్వాత కూడా సంతోషంగానే కనిపించిన నరేష్ అంతలోనే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్నది అంతుచిక్కని విషయంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: