విధి నిర్వహణలో ఉన్న ఎస్సైని నెట్టారంటూ సోము వీర్రాజుపై కేసు నమోదు!

విధి నిర్వహణలో ఉన్న ఎస్సైని నెట్టారంటూ సోము వీర్రాజుపై కేసు నమోదు!

  • అమలాపురం వెళ్లేందుకు సోము వీర్రాజు ప్రయత్నం
  • జొన్నాడ వద్ద అడ్డుకున్న పోలీసులు
  • ఇరువర్గాల మధ్య వాగ్వాదం
  • పోలీసు విధులకు ఆటంకం కలిగించారని అభియోగం
  • 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల అమలాపురంలో అల్లర్లు జరగ్గా, సోము వీర్రాజు పరామర్శించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో సోము వీర్రాజును పోలీసులు జొన్నాడ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అమలాపురంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్-30 అమల్లో ఉన్నందున నిలిపివేశామని సోము వీర్రాజుకు పోలీసులు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో ఉన్న ఎస్సైని నెట్టివేశారని సోము వీర్రాజుపై అభియోగాలు మోపారు. ఈ మేరకు కోనసీమ జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 353, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు.

అయితే, సోము వీర్రాజుతో పోలీసుల వాగ్వాదం ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందని ఏపీ బీజేపీ ఆరోపించింది. జొన్నాడ జంక్షన్ లో పోలీసులు సోము వీర్రాజుతో వాగ్వాదానికి దిగగా, మరో పోలీసు దాన్ని వీడియోలో చిత్రీకరించడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు ఓ పోలీసు వీడియో తీస్తున్న ఫొటోను కూడా ఏపీ బీజేపీ పంచుకుంది.

అమలాపురం వెళుతుండగా తన వాహనాన్ని పోలీసులు ఆపడంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ ఎస్సైని నెట్టివేస్తూ తీవ్ర ఆవేశం ప్రదర్శించారు. నువ్వెవరివి నన్ను ఆపడానికి? నన్ను ఆపమని నీకు చెప్పింది ఎవరు? అంటూ ఆ పోలీసు అధికారిపై మండిపడ్డారు. మీతో నేను మాట్లాడను… నేను ఎస్పీతో మాట్లాడతా! అంటూ తీవ్రస్వరంతో వాగ్యుద్ధానికి దిగారు.

అంతేకాదు, తన కారుకు అడ్డంగా నిలిపిన కంటైనర్ వాహనం డ్రైవర్ పైనా “ఇడియట్” అంటూ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. కంటైనర్ వాహనానికి పోలీసులు అడ్డు నిలబడగా, సోము వీర్రాజు కంటైనర్ డ్రైవర్ పై ఆగ్రహం ప్రదర్శించారు. పోలీసులు అడ్డు తొలగందే తానెలా ముందుకు పోగలనంటూ ఆ డ్రైవర్ నిస్సహాయత వ్యక్తం చేశాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

 

.

Leave a Reply

%d bloggers like this: