వెంటిలేట‌ర్‌పై పాక్ మాజీ అధ్య‌క్షుడు ముషారఫ్… చ‌నిపోయారంటూ ప్ర‌చారం

వెంటిలేట‌ర్‌పై పాక్ మాజీ అధ్య‌క్షుడు ముషారఫ్… చ‌నిపోయారంటూ ప్ర‌చారం

  • యూఏఈలో చికిత్స పొందుతున్న ముషారఫ్‌
  • ముషారఫ్ చ‌నిపోయారంటూ ప్ర‌చారం
  • ముషారఫ్ మ‌ర‌ణంపై ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన వ‌క్త్ న్యూస్‌

పాకిస్థాన్ మాజీ అధ్య‌క్షుడు జ‌నర‌‌ల్ ప‌ర్వేజ్ ముషారఫ్ ఆరోగ్యం విష‌మించింది. ప్ర‌స్తుతం యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆయ‌న‌కు వైద్యులు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారం చేజిక్కించుకుని పాక్ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు.

1943 ఆగ‌స్టు 11న‌ ముషారఫ్ ఢిల్లీలో జ‌న్మించారు. దేశ విభ‌జ‌న స‌మ‌యంలో ఆయన కుటుంబం పాకిస్థాన్ కు వలస వెళ్లిపోయింది. ఆ తర్వాత పాకిస్థాన్ సైన్యంలో చేరిన ముషారఫ్ సుదీర్ఘ కాలం పాటు సేవ‌లందించారు. అంతవరకు సైన్యాధ్యక్షుడిగా వున్న ముషారఫ్ 1998లో సైనిక తిరుగుబాటు ద్వారా నవాజ్ షరీఫ్ ను ప్రధాని పదవి నుంచి తప్పించి సైనిక పాలన చేబట్టారు. తర్వాత 2001 నుంచి 2008 వరకు ఆయన పాక్ అధక్షుడిగా కొనసాగారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో కేసుల నుంచి తప్పించుకోవడానికి 2016లో దుబాయ్ కి వెళ్లి రాజకీయ ఆశ్రయం పొందుతున్నారు.

ఇదిలా ఉంటే… శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ముషారఫ్ చ‌నిపోయారంటూ వార్త‌లు వెలువ‌డ్డాయి. పాకిస్థాన్‌కు చెందిన వ‌క్త్ న్యూస్ అనే మీడియా సంస్థ ముషారఫ్ చ‌నిపోయారంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. అయితే ఈ వార్త‌లు అవాస్తవమంటూ ఇత‌ర మీడియా సంస్థ‌లు వెల్ల‌డించ‌గా… వ‌క్త్ న్యూస్ స‌ద‌రు ట్వీట్‌ను తొల‌గించింది.

Leave a Reply

%d bloggers like this: