కోల్ కతాలో విచ్చలవిడిగా కాల్పులు జరిపిన పోలీసు… మహిళ మృతి!

కోల్ కతాలో విచ్చలవిడిగా కాల్పులు జరిపిన పోలీసు… మహిళ మృతి!

  • బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయానికి చేరువలో ఘటన
  • తుపాకీతో రోడ్డుపైకి వచ్చిన పోలీసు
  • 15 రౌండ్ల వరకు కాల్పులు
  • ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య

కోల్ కతాలో ఓ పోలీసు విచ్చలవిడిగా కాల్పులు జరిపి, ఆపై తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయానికి సమీపంలోని పార్క్ సర్కస్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆర్మ్ డ్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చోదప్ లేప్చా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుపాకీతో విచక్షణరహితంగా 10 నుంచి 15 రౌండ్లు కాల్పులు జరిపాడు. వీటిలో ఓ బుల్లెట్ దారినపోతున్న మహిళ వెన్నెముకను ఛిద్రం చేస్తూ దూసుకెళ్లింది. ఆ మహిళ బుల్లెట్ గాయంతో ప్రాణం విడిచింది. అనంతరం గడ్డం కింద తుపాకీ పెట్టుకుని ఆ కానిస్టేబుల్ తనను తాను కాల్చుకున్నాడని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.

చోదప్ లేప్చా ఇటీవల సెలవుపై వెళ్లి శుక్రవారమే తిరిగి విధుల్లో చేరాడు. తుపాకీ చేతబట్టి ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన అతను… పెద్దగా కేకలు వేస్తూ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తికి ఇక్కడి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆ కానిస్టేబుల్ తుపాకీతో రోడ్డు మీదికి రాగా, అతడేదో బొమ్మ తుపాకీతో తమాషా చేస్తున్నాడని స్థానికులు భావించారు.

అయితే ఆ తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్లు ఓ కారును తాకగా, ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. నిజమైన కాల్పులే అని అర్థంకాగా, అక్కడి వాళ్లు హడలిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. చోదప్ లేప్చా ఫస్ట్ బెటాలియన్ కు చెందిన ఆర్మ్ డ్ కానిస్టేబుల్ అని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: