రాష్ట్రంలో వైసీపీ హత్యాకాండ …పోలీసులు తీరు అభ్యంతరకరం ..చంద్రబాబు మండిపాటు!

రాష్ట్రంలో వైసీపీ హత్యాకాండ …పోలీసులు తీరు అభ్యంతరకరం ..చంద్రబాబు మండిపాటు!
-వివేకా హత్య కేసులో ఉన్నవారిని చంపేస్తారని మేం ముందునుంచి చెబుతున్నామన్న బాబు
-టీడీపీ ఆఫీసులో ఫొటో ఎగ్జిబిషన్
-వైసీపీ దాష్టీకాలతో చనిపోయిన వారి వివరాలు అంటూ ప్రదర్శన
-ప్రెస్ మీట్లో నిప్పులు చెరిగిన చంద్రబాబు
-వైసీపీ ప్రభుత్వంపైనా, పోలీసుల తీరుపైనా విమర్శనాస్త్రాలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. వైసీపీ దాష్టీకాలతో చనిపోయిన వారి వివరాలు పేరిట ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి మరణాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

“వివేకాను గొడ్డలిపోటుతో చంపేసి, గుండెపోటుగా చిత్రీకరించారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నాపైనా, టీడీపీపైనా నేరారోపణలు చేశారు. ఆ తర్వాత ఆయన కూతురే కోర్టుకు వెళ్లి సీబీఐ ఎంక్వైరీ వేయించారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ కేసులో ఇప్పటిదాకా ముగ్గురు చనిపోయారు. శ్రీనివాసులు రెడ్డి ఎందుకు చనిపోయారు? మీ మామ డాక్టర్ గంగిరెడ్డి ఎందుకు చనిపోయారు? నిన్న గంగాధర్ రెడ్డి అని ఒకతను ఎందుకు చనిపోయాడు? వీళ్లందరికీ ఆ కేసులో సంబంధం ఉంది.

శ్రీనివాసులురెడ్డి నిందితుల్లో ఒకరని చెప్పారు. గంగిరెడ్డి డాక్టరు. మృతదేహానికి ఆయన డిస్పెన్సరీలోనే కుట్లు వేయించారు. గంగాధర్ రెడ్డికి రూ.10 కోట్లు ఆఫర్ ఇచ్చింది నిజమా? కాదా?… కానీ గంగాధర్ రెడ్డిని బెదిరించి సీబీఐపైనే కేసు పెట్టించారు. ఇప్పుడా గంగాధర్ రెడ్డి కూడా శవమైపోయాడు. దాంతో ఇప్పటిదాకా ముగ్గురు పోయారు.

ఇక, తాను కూడా నేరంలో ఉన్నానంటూ డ్రైవర్ దస్తగిరి నేరాన్ని అంగీకరించి అప్రూవర్ గా మారాడు. సీబీఐ వద్ద అప్రూవర్ గా మారిన వ్యక్తిని కూడా చంపేస్తామని బెదిరించగా, ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. ఎక్కడికి పోతోందీ ఈ రాష్ట్రం?

అటు, సీబీఐ డ్రైవర్ నే బెదిరిస్తున్నారు. కడప నుంచి సీబీఐ వెళ్లిపోకపోతే బాంబులేసి చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సీబీఐకే సమర్థత లేకపోతే దేశాన్ని ఇక ఎవరు కాపాడతారు? వీళ్లు కరడుగట్టిన నేరగాళ్లు… గతంలో పరిటాల రవి హత్య కేసులోనూ ఇలాగే చేశారు. ఇప్పుడు వివేకా హత్య కేసు సంబంధీకులు ఒక్కొక్కరు చనిపోతున్నారు.

వివేకా హత్య కేసులో ఉన్నవారిని చంపేస్తారని చెబుతూనే ఉన్నాం. ఈ కేసులో మేం చెప్పినట్టే జరుగుతోంది. ఈ వ్యవహారం సీబీఐ విశ్వసనీయతకు పెనుసవాల్ వంటిది. జగన్ అవినీతిపై సీబీఐ చార్జిషీటు వేసినా ఏంచేయలేకపోయింది” అని పేర్కొన్నారు.

అంతకుముందు, వైసీపీ పాలనలో ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. 4 వేల మంది కార్యకర్తలపైనా, 60 మంది టీడీపీ నేతలపైనా దాడులు చేశారని, కేసులు పెట్టారని ఆరోపించారు. 37 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. నలుగురు మాజీ మంత్రులు, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారని వెల్లడించారు. ఈ మూడేళ్లలో 2,552 మంది రైతులు, 422 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. వైసీపీ పాలనలో మహిళలపైనా ఆగడాలు పెరిగాయని తెలిపారు.

ఈ దాష్టీకాలు ఇకపై జరగడానికి వీల్లేదని చెప్పడానికే తాను ఇవాళ మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఒక్క మాచర్లలోనే ఐదు హత్యలు జరిగాయని వెల్లడించారు. తాను హెచ్చరికలు చేసినప్పటికీ నిన్న జల్లయ్య అనే కార్యకర్తను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు, మాచర్ల నుంచి అనేక కుటుంబాలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. పోలీసులు అసలు డ్యూటీ చేస్తున్నారా? లేక నేరస్తులకు వంత పాడుతున్నారా?… దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని అన్నారు. అక్రమ నిర్బంధాలకు పోలీసులు కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

“అనంతబాబు అనే ఎమ్మెల్సీ… డ్రైవర్ ను చంపేసి మృతదేహాన్ని ఇంటికి పంపించి, అంత్యక్రియలు వెంటనే చేయకపోతే కేసులు పెడతామని బెదిరించారు… అసలు డీజీపీ ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాను. ఆలిండియా సర్వీసు మీరు పాసయ్యారా? అని అడుగుతున్నా. టీడీపీ తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తే ఆ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు. కానీ ఈ విషయం పక్కదారి పట్టించడానికి కులాల మధ్య చిచ్చుపెట్టారు. అసలు కోనసీమలో ఏం జరిగింది? కోనసీమలో జరిగిందానికి తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తాము ఉన్నది ఎందుకో ఆలోచించుకోవాలి” అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

%d bloggers like this: