తాడిప‌త్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడిపై పోలీసు కేసు!

తాడిప‌త్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడిపై పోలీసు కేసు!

  • తాడిప‌త్రిలో మురుగు నీటి పైపులైను ప‌నుల్లో వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య వాగ్వాదం
  • దృశ్యాల‌ను చిత్రీక‌రిస్తున్న మీడియా ప్ర‌తినిధుల‌పై వైసీపీ నేత‌ల దాడి
  • ఓ మీడియా ప్ర‌తినిధి సెల్ ఫోన్ లాక్కుని దానిలోని డేటా తొల‌గించిన వైనం
  • మీడియా ప్ర‌తినిధుల ఫిర్యాదుతో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డిపై కేసు న‌మోదు

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప‌ట్ట‌ణంలో మురుగు నీటి కాల్వ‌ల మ‌ర‌మ్మ‌తు వార్త క‌వ‌ర్ చేసేందుకు వెళ్లిన త‌మ‌పై దాడి చేశార‌ని మీడియా ప్ర‌తినిధులు చేసిన ఫిర్యాదు ఆధారంగా తాడిప‌త్రి పోలీసులు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. మీడియా ప్ర‌తినిధుల‌తో పాటు టీడీపీ నేత‌ల‌పైనా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి దాడి చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

తాడిప‌త్రిలో మురుగు నీటి పైపులైను ప‌నుల విష‌యంలో శనివారం వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ దృశ్యాల‌ను చిత్రీక‌రిస్తున్న మీడియా ప్ర‌తినిధుల‌ను చూసిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి చిత‌క‌బాదారు. అంతేకాకుండా ఓ మీడియా ప్ర‌తినిధి సెల్ ఫోన్ లాక్కుని వెళ్లిపోయారు. దీనిపై మీడియా ప్ర‌తినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా… హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి అనుచ‌రుల నుంచి మీడియా ప్ర‌తినిధి ఫోన్‌ను తిరిగి ఇప్పించారు. అయితే స‌ద‌రు ఫోన్‌లో డేటాను తొల‌గించారంటూ మీడియా ప్ర‌తినిధి ఫిర్యాదు చేయ‌గా… హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Leave a Reply

%d bloggers like this: