Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బహుళజాతి సంస్థల పార్టీ బీజేపీ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..

బహుళజాతి సంస్థల పార్టీ బీజేపీ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..
-బిజెపి రూపంలో దేశాన్ని కబళిస్తున్న బహుళజాతి సంస్థలు
-అంబానీ, ఆదానిలకు దేశ సంపదను ధారాదత్తం చేస్తున్న మోడీ
-వెస్ట్ ఇండియా కంపెనీని దేశం నుంచి తరిమి తరిమి కొడతాం
-కెసిఆర్ నిజస్వరూపం ఈ ఎన్నికల్లో తేలిపోతుంది
-మీడియా సమావేశంలో   సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

వెస్ట్ ఇండియా కంపెనీ, బహుళజాతి సంస్థలు భారతీయ జనతా పార్టీ రూపంలో దేశాన్ని కబలించడం కోసం కుట్రలు చేస్తున్నాయని
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. బిజెపి కుట్రలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ పై మోడీ సర్కార్ తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష్య సాధింపునకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. బుధవారం మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం నరసింహపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బహుళ జాతి సంస్థలు, వ్యాపారస్తులు, కార్పొరేట్ల పార్టీగా బిజెపి మారిందని దుయ్యబట్టారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ వనరులను, దేశ సంపదను అంబానీ, ఆదానీల బహుళజాతి సంస్థలకు ధారాదత్తం చేసే పార్టీగా బిజెపి మారిందని ధ్వజ మెత్తారు. బిజెపి అనుసరిస్తున్న ఈ విధానాలతో దేశ ప్రజలు బహుళజాతిసంస్థల ముందు మోకరిల్లి బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వివరించారు. వ్యాపారం చేయడానికి భారతదేశంలో అడుగుపెట్టిన బహుళజాతి సంస్థ ఈస్టిండియా కంపెనీ దేశాన్ని కబలించిందన్నారు. దాదాపుగా 200 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం లేకుండా చేసిన బ్రిటిష్ పరిపాలనను పారద్రోలి దేశానికి స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రసాదించిందన్నారు. ఈస్టిండియా తరహాలోనే వెస్ట్ ఇండియా బహుళజాతి సంస్థలు దేశాన్ని కబలించడం కోసం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి దేశ వ్యాప్తంగా ప్రజలను కాంగ్రెస్ ఏకం చేస్తున్నదని వివరించారు.

కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి భయపడి రాజకీయంగా ఎదుర్కోలేని బిజెపి పిరికిపందలు గాంధీ-నెహ్రూ వారసులైన సోనియా, రాహుల్ ను ఈ.డి నోటీసుల పేరిట వేధించాలని, భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి బెదిరింపులకు దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రాణాలర్పించిన ఇందిర, రాజీవ్ వారసులు భయపడతారా అని ప్రశ్నించారు. ఈస్టిండియా కంపెనీని ఈ దేశం నుంచి కాంగ్రెస్ పార్టీ తరిమి కొట్టినట్టుగానే… సోనియా, రాహుల్ నాయకత్వంలో వెస్ట్ ఇండియా కంపెనీ, బహుళజాతి సంస్థల పార్టీని దేశం నుంచి తరిమి కొడతాం అని హెచ్చరించారు. దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి బద్ధ వ్యతిరేకమైన బిజెపి నుంచి దేశాన్ని కాపాడుకుంటామని వెల్లడించారు.

కెసిఆర్ నిజస్వరూపం ఈ ఎన్నికల్లో తేలిపోతుంది

బిజెపి తో యుద్ధం ప్రకటించినట్లు పదే పదే చెబుతున్న సీఎం కేసీఆర్ నిజ స్వరూపం ఇప్పుడు జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో తేలిపోతుందన్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిలో ఉండనని కెసిఆర్ చెప్పడం పరోక్షంగా బిజెపికి సహకరించడమే అవుతుందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఓట్లు 51 శాతం ఉండగా, ఎన్డీఏ పక్షాల ఓట్లు 49 శాతం ఉందన్నారు. 51 శాతం ఉన్న ప్రతిపక్షాల ఓట్లను చీల్చి గెలవడం కోసం బిజెపి కుట్రలు చేస్తుందని వివరించారు. బిజెపి చేస్తున్న ఈ కుట్రలను తిప్పికొట్టే లౌకిక వాదం వైపు ఉండే ప్రతిపక్షాల కూటమిలో ఉంటారా? లేక బిజెపి కుట్రదారుడిగా సీఎం కేసీఆర్ ఉంటారా అనేది ఈ ఎన్నికల్లో తేలిపోతుందన్నారు. దేశంలో లౌకిక పార్టీలు చేస్తున్న బీజేపీ వ్యతిరేక ఉద్యమానికి కెసిఆర్ మద్దతుగా నిలబడకుండ, ప్రతిపక్ష ఓట్లు చీలిపోయే విధంగా వ్యవహరిస్తే పరోక్షంగా బిజెపికి సహకరించడమే అవుతుందన్నారు. రాజ్యాంగ వాదులు, ప్రజాస్వామిక వాదులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే మతతత్వ శక్తులకు కొమ్ముకాసే వారిని క్షమించరని, ఎన్నికల సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Related posts

షర్మిల ఎంట్రీతో ఉలిక్కి పడ్డ రాజకీయ పార్టీలు

Drukpadam

వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి కనపడటం లేదంటూ పోస్టర్లు…పద్మావతి స్పందన!

Drukpadam

టీఆర్ యస్ లో మునుగోడు లొల్లి ….మాజీఎంపీ బూరనరసయ్య గౌడ్ తీవ్ర అసంతృప్తి !

Drukpadam

Leave a Comment