నేషనల్ హెరాల్డ్ పత్రిక కు రుణ సహాయం చేయడం నేరమా? పీపుల్స్ మార్చ్ లో భట్టి!

నేషనల్ హెరాల్డ్ పత్రిక కు రుణ సహాయం చేయడం నేరమా? పీపుల్స్ మార్చ్ లో భట్టి!
-మోడీ, అమిత్ షా కుట్రలను దేశ ప్రజలు తిప్పి కొడతారు
-వచ్చే ఎన్నికల్లో బిజెపికి బుద్ధి చెప్పడం ఖాయం
-రాజ్యాంగ వాదులు, ప్రజాస్వామికవాదులు ఏకం కావాలి

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సహాయం చేయడం నేరమా ? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు . పీపుల్స్ మార్చ్ లో భాగంగా మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబంపై కక్ష పూర్తిగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు . సహాయం చేయడం నేరమన్నట్లు చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఎప్పుడో కోర్టులు సైతం పక్కన పెట్టిన కేసును తిరగతోడి కేసులు పెట్టి దేశంకోసం త్యాగం చేసి ,ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడం పై మండిపడ్డారు .

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై అక్రమ ఈ.డీ కేసులు బనాయించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్న మోడీ, అమిత్ షా కుట్రలను దేశ ప్రజలు తిప్పికొడతారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన పాదయాత్రను బుధవారం ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురంలోసీఎల్పీ నేత భట్టి విక్రమార్క పుణ ప్రారంభించారు. వెంకటాపురం నుంచి నారాయణపురం, రాజపాలెం, నరసింహపురం, బుచ్చిరెడ్డి పాలెం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ రుణ సహాయం చేయడం నేరం అన్నట్టుగా సోనియా, రాహుల్ పై బిజెపి సర్కార్ అక్రమ కేసులు బనాయించిందని మండిపడ్డారు. మతతత్వ బిజెపి అవినీతి బండారాన్ని కాంగ్రెస్ పునః ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక బయట పెడుతుందన్న భయంతో
ఆ పత్రికను మూసివేయడానికి బిజెపి చేస్తున్న కుట్ర ఫలితమే ఈ.డి నోటీసుల విచారణ అని పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మోతిలాల్ నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ.డీ విచారణ పేరిట గత మూడు రోజులుగా గంటల తరబడి రాహుల్ గాంధీ గారిని విచారణ చేయడాన్ని యావత్ జాతి చూస్తున్నారన్నారు. బ్రిటిష్ పరిపాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడం కోసం స్వాతంత్ర సంగ్రామంలో తమ ఆస్తులను మొత్తం దేశం కోసం త్యాగం చేసిన నెహ్రూ కుటుంబ వారసులైన సోనియా, రాహుల్ గాంధీపై అవినీతి బురద జల్లే కుట్రలు చేస్తున్న బీజేపీ పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడటం ఖాయమన్నారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ ప్రతిష్ట, వనరులు, ప్రభుత్వ రంగ సంస్థల సంరక్షణకై స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తితో మరో చారిత్రక ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బిజెపి పాలకులను కేంద్రంలో గద్దెదించకుంటే దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉన్నందున రాజ్యాంగ వాదులు, ప్రజాస్వామికవాదులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

%d bloggers like this: