అల్లర్లలో పాల్గొంటే సైన్యంలో ఉద్యోగం రాదు: వాయుసేనాధిపతి!

అల్లర్లలో పాల్గొంటే సైన్యంలో ఉద్యోగం రాదు: వాయుసేనాధిపతి!

  • అభ్యర్థులకు చివరిగా పోలీసుల క్లియరెన్స్ అవసరమన్న వీఆర్ చౌదరి
  • అల్లర్లు, ఆందోళనల్లో పాల్గొంటే అది రాదని హెచ్చరిక
  • పథకాన్ని, ప్రయోజనాలను సరిగ్గా అర్థం చేసుకోవాలని సూచన

త్రివిధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాల ఉద్యోగ పథకం అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, హింసాత్మక చర్యలు, విధ్వంసాలు జరుగుతున్నాయి. స్వల్ప కాల కోర్సుతో సైన్యంలో పూర్తి స్థాయి నియామకాల కలలు ఇక సాకారం కావన్న ఆందోళన నిరుద్యోగ అభ్యర్థుల్లో ఉంది. దీనికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చర్యలకు దిగడం తప్పు కాదు. కానీ, యువత అసలు తమ లక్ష్యాన్నే చంపుకోవాల్సిన రీతిలో వ్యవహరిస్తున్నారు.

కొత్త పథకం ఉపసంహరించుకునే దిశగా  కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరుద్యోగులు తాము ఎంచుకున్న పథం సరైనది కాదని గుర్తించడం లేదు. అల్లర్లు, విధ్వంసాలు చట్ట పరమైన నేరాలు. సైన్యంలో ప్రవేశాలకు ఎటువంటి నేర చరిత్ర ఉండకూదని నిబంధనలు చెబుతున్నాయి. కనుక ఇప్పుడు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని కేసు నమోదైతే వారికి సైన్యంలో ప్రవేశాలకు అర్హత ఉండదని అర్థం చేసుకోవాలి.

దీనిపై వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి స్పందిస్తూ.. ఈ రకమైన హింసాత్మక చర్యలను తాము ఊహించలేదని చెప్పారు. రక్షణ దళాల్లో ప్రవేశాల కోసం చూస్తున్న అభ్యర్థులు ప్రస్తుత ఆందోళనల్లో పాల్గొంటే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

‘‘ఈ తరహా హింసను మేము ఖండిస్తున్నాం. ఇది కాదు పరిష్కారం. సైన్యంలో ప్రవేశానికి అభ్యర్థులకు చివరిగా పోలీసు క్లియరెన్స్ కావాలి. ఎవరైనా అల్లర్లలో పాల్గొంటే వారికి పోలీసుల నుంచి క్లియరెన్స్ రాదు’’అని వీర్ చౌదరి తెలిపారు. ఎవరికైనా కొత్త కార్యక్రమంపై సందేహాలుంటే సమీపంలోని ఆర్మీ స్టేషన్లు, ఎయిర్ ఫోర్స్, నేవల్ కేంద్రాలను సంప్రదించి తొలగించుకోవచ్చని సూచించారు.

‘‘సరైన సమాచారం తెలుసుకునేందుకు వారు ప్రయత్నం చేయాలి. అగ్నిపథ్ పథకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రయోజనాలను చూడాలి’’అని చెప్పారు. అగ్నిపథ్ పథకం గత రెండేళ్ల నుంచి రూపకల్పన దశలో ఉన్నట్టు తెలిపారు. సాయుధ దళాల సగటు వయసును 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించడమే దీని లక్ష్యమని చెప్పారు. పథకం ఉపసంహరణ సాధ్యం కాదని తేల్చేశారు. పూర్తిగా అమల్లోకి తెచ్చిన తర్వాత అవసరమైన సవరణలను పరిశీలిస్తామన్నారు.

Leave a Reply

%d bloggers like this: