చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేసిన రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము ….

స్వయంగా చీపురు పట్టి, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము!
-నిన్ననే ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎంపికైన ముర్ము
-ఆ మ‌రునాడే శివాల‌యానికి వెళ్లిన బీజేపీ నేత‌
-ఆల‌యాన్ని స్వ‌హ‌స్తాల‌తో శుభ్రం చేసిన వైనం
-సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో

ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎంపికైన ద్రౌప‌ది ముర్ముకు చెందిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. మంగ‌ళ‌వారం బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశంలో ద్రౌప‌ది ముర్మును ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్యర్థిగా ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు ద‌క్కిన ఈ అవ‌కాశానికి ఏమాత్రం పొంగిపోని ఆమె… బుధ‌వారం నేరుగా త‌న సొంత నియోజ‌క వ‌ర్గం రాయ్‌రంగాపూర్‌లోని శివాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల్లో నిమగ్న‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆమె ఆల‌యం ప్రాంగ‌ణాన్ని స్వ‌యంగా శుభ్రం చేశారు. చీపురు చేత‌బ‌ట్టి ఆల‌య ప్రాంగ‌ణాన్ని ఆమె శుభ్రం చేశారు. అనంత‌రం ఆమె శివుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, గ‌వ‌ర్న‌ర్‌గా కీల‌క ప‌ద‌వుల‌ను చేప‌ట్టిన ఆమె తాజాగా దేశ అత్యున్న‌త ప‌ద‌వి రాష్ట్రప‌తి ప‌ద‌వి రేసులో నిలిచారు. అయినా కూడా త‌న మూలాల‌ను మ‌ర‌వ‌ని ముర్ము త‌న సొంతూళ్లోని శివాల‌యంలో ఇలా ఆల‌య ప్రాంగ‌ణాన్ని శుభ్రం చేస్తూ గ‌డిపారు.

ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందిన రాయ్ రంగాపూర్ నియోజక‌వ‌ర్గం నుంచే ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. తాను రాజ‌కీయాల్లోకి రాక‌ముందు నుంచీ కూడా ఆమె ఆ ఆల‌యంలో పూజ‌లు చేస్తున్నారు. తాజాగా ఎన్ని ప‌ద‌వులు చేప‌ట్టినా ఆ హోదాల్ని పక్కన పెట్టి, ఆమె ఈ తరహాలో తన భక్తిభావాన్ని చాటుకోవడం విశేషం.

Leave a Reply

%d bloggers like this: