కాన్వాయ్‌ని స్లో చేయించి విన‌తి ప‌త్రాలు తీసుకున్న జ‌గ‌న్‌… 

కాన్వాయ్‌ని స్లో చేయించి విన‌తి ప‌త్రాలు తీసుకున్న జ‌గ‌న్‌… 

  • జ‌గ‌న్‌కు విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు రోడ్డు ప‌క్కగా నిలుచున్న దంప‌తులు
  • వారిని చూసి కాన్వాయ్‌ను స్లో చేయించిన జ‌గ‌న్‌
  • భ‌ద్ర‌తా సిబ్బందిని పంపి విన‌తి ప‌త్రాన్ని తీసుకున్న సీఎం

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం నాటి శ్రీ బాలాజీ జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌న‌కు విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు రోడ్డు ప‌క్క‌గా నిలుచున్న దంప‌తుల‌ను చూసిన జ‌గ‌న్‌… త‌న కాన్వాయ్‌ను స్లో చేయించి త‌న భ‌ద్ర‌తా సిబ్బంది చేత ఆ దంప‌తుల నుంచి విన‌తి ప‌త్రాల‌ను తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే.. శ్రీకాళ‌హ‌స్తికి చెందిన మ‌హేశ్ 2019లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో చేయి విరిగిపోగా… కాలు కూడా ప‌నిచేయ‌డం మానేసింది. వైద్యం కోసం రూ.7 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో ఉన్న ఆస్తి అంతా క‌రిగిపోయింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌తో గ‌డుపుతున్న అత‌డు, మెడిక‌ల్ బిల్లు రీయింబ‌ర్స్‌మెంట్ కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నాడు.

ఈ క్ర‌మంలో గురువారం శ్రీకాళ‌హ‌స్తికి జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని తెలిసి ఆయ‌న‌కు త‌న బాధ‌ను చెప్పుకునేందుకు భార్య‌తో క‌లిసి రోడ్డు ప‌క్క‌గా నిలుచున్నాడు. జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని శ్రీకాళ‌హ‌స్తి నుంచి రేణిగుంట‌కు వెళుతున్న స‌మ‌యంలో రోడ్డు ప‌క్క‌గా విన‌తి ప‌త్రాలు చేత‌బ‌ట్టుకుని నిలుచున్న దంప‌తుల‌ను చూసి త‌న కాన్వాయ్‌ను స్లో చేయించారు. త‌న భ‌ద్ర‌తా సిబ్బంది ద్వారా దంప‌తుల నుంచి విన‌తి ప‌త్రం తీసుకున్నారు.

Leave a Reply

%d bloggers like this: