కాంగ్రెస్ పార్టీలో చేరిన పీజేఆర్ త‌న‌య విజ‌యారెడ్డి…

కాంగ్రెస్ పార్టీలో చేరిన పీజేఆర్ త‌న‌య విజ‌యారెడ్డి… సాద‌రంగా ఆహ్వానించిన రేవంత్‌, కోమ‌టిరెడ్డి!

  • టీఆర్ఎస్ కార్పొరేట‌ర్‌గా కొన‌సాగుతున్న విజ‌యారెడ్డి
  • కాంగ్రెస్‌లో చేర‌తాన‌న్న విజ‌యారెడ్డిని ఆహ్వానించిన రేవంత్‌
  • గురువారం లాంఛ‌నంగా కాంగ్రెస్‌లో చేరిన విజ‌యారెడ్డి
  • విజ‌యారెడ్డిని ఎమ్మెల్యేగా చేసిన‌ప్పుడే పీజేఆర్‌కు నిజ‌మైన నివాళి అన్న కోమ‌టిరెడ్డి

కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగిన దివంగ‌త పి.జ‌నార్ద‌న్ రెడ్డి కుమార్తె విజ‌యారెడ్డి గురువారం తిరిగి త‌న సొంత గూడుకు చేరుకున్నారు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో కొన‌సాగుతున్న ఆమె జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్‌గానూ కొన‌సాగుతున్నారు. అయితే టీఆర్ఎస్‌లో త‌న‌కు త‌గినంత మేర ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌న్న భావ‌నతో ఆమె చాలా కాలంగా మ‌ద‌న‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక కాంగ్రెస్ పార్టీలో స‌రికొత్త జోష్ క‌నిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయిన విజ‌యారెడ్డి.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరాల‌నుకుంటున్న‌ట్లుగా తెలిపారు. ఆమె ప్ర‌తిపాద‌న‌కు అక్క‌డిక‌క్క‌డే ఓకే చెప్పేసిన రేవంత్‌… విజ‌యారెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. తాజాగా గురువారం విజ‌యారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, మ‌ల్లు ర‌వి త‌దిత‌రుల స‌మక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వ‌చ్చి చేరిన విజ‌యారెడ్డికి కోమ‌టిరెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. పీజేఆర్ కూతురు అయిన విజ‌యారెడ్డి త‌మ‌కు సోద‌రి అని పేర్కొన్న కోమ‌టిరెడ్డి… ఖైర‌తాబాదే కాకుండా ఎక్క‌డ నిలుచున్నా విజ‌యారెడ్డి ఎమ్మెల్యే అవుతార‌ని చెప్పారు. విజ‌యారెడ్డిని ఎమ్మెల్యేను చేసిన‌ప్పుడే పీజేఆర్‌కు అస‌లైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: