Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికాలో తుపాకుల వినియోగంపై ఆంక్షలు….

అమెరికాలో తుపాకుల వినియోగంపై ఆంక్షలు విధించే బిల్లుపై సంతకం చేసిన బైడెన్

  • -అమెరికాలో విశృంఖలంగా తుపాకీ కాల్పుల ఘటనలు
  • -ఇటీవల టెక్సాస్ లో ఘోరం
  • -19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్ల మృతి
  • -బిల్లుకు చట్టసభల ఆమోదం
  • -ఇక ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుందన్న బైడెన్

అమెరికాలో ఇటీవల కాలంలో తుపాకీ కాల్పుల ఘటనలు అధికంగా చోటుచేసుకున్నాయి. కొన్నిరోజుల కిందట టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు బలయ్యారు. దాంతో తుపాకీ సంస్కృతిపై అమెరికా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, తుపాకుల వినియోగంపై ఆంక్షలు విధించే కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు.

దశాబ్దాల తరబడి విస్తృతమైన తుపాకీ హింస నుంచి ప్రజలను కాపాడేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందని బైడెన్ భావిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు భరోసా లభిస్తుందని తుపాకీ కాల్పుల బాధితులను ఉద్దేశించి వైట్ హౌస్ లో బైడెన్ వ్యాఖ్యానించారు. బాధితుల వేదన తమను ఏదో ఒకటి చేయాలన్న దిశగా నడిపించిందని, ఇవాళ ఆ పని పూర్తి చేశామని వెల్లడించారు. ఈ బిల్లుకు గురువారం సెనేట్ లో ఆమోదం లభించగా, ప్రతినిధుల సభలో శుక్రవారం మోక్షం కలిగింది. యూరప్ లో రెండ్రోజుల పర్యటనకు వెళ్లేముందు బైడెన్ ఈ బిల్లును సమీక్షించి సంతకం చేశారు.

ఈ బిల్లు చట్టరూపంలో అమల్లోకి వస్తే… బాలలు తుపాకులు కొనుగోలు చేయడంపై నిశితంగా దృష్టిసారించేందుకు వీలు కల్పిస్తుంది. పిన్న వయసు తుపాకీ కొనుగోలుదార్ల నేపథ్యం గురించిన తనిఖీలు మరింత కఠినతరం చేయడం ఈ బిల్లుతో సాధ్యమవుతుంది. అంతేకాదు, ప్రమాదకరమైన వ్యక్తులుగా గుర్తించిన వారి నుంచి తుపాకులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకునే వెసులుబాటు కలిగిస్తుంది. అంతేకాదు, గృహ హింస నేరాలకు పాల్పడిన వారు ఇకపై తుపాకులు పొందడం కష్టసాధ్యంగా మారనుంది. ఈ మేరకు కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు దోహదపడుతుంది.

Related posts

కుంగిపోతున్న న్యూ యార్క్ సిటీ …పరిశోధకుల నిర్ధారణ …!

Drukpadam

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి…

Drukpadam

గ్యాంగ్ రేప్ కేసులో న‌లుగురు నిందితులు మేజ‌ర్లు!

Drukpadam

Leave a Comment