మా కుటుంబాలకు ఏదైనా జరిగితే సర్కారుదే బాధ్యత.. సీఎం ఉద్ధవ్​కు షిండే లేఖ!

మా కుటుంబాలకు ఏదైనా జరిగితే సర్కారుదే బాధ్యత.. సీఎం ఉద్ధవ్​కు షిండే లేఖ!
-ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించారని ఆరోపణ
-మహారాష్ట్ర హోం మంత్రి, డీజీపీకి కూడా లేఖ
-అలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్న హోం మంత్రి

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను అధికారంలో నుంచి దింపాలని ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన రెబల్ ఎమ్యెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్ధవ్.. మిత్రపక్షాలు ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

అయితే, ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన 38 మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించారని ఆరోపిస్తూ సీఎం ఉద్ధవ్ కు ఏక్ నాథ్ షిండే లేఖ రాశారు. తమ కుటుంబాలకు ఏమైనా జరిగితే రాష్ట్ర సర్కారుదే బాధ్యతన్నారు. భద్రత తొలగించడమంటే భయపెట్టడమేనని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీరుతో తమ బంధువులు ఆందోళనలో ఉన్నారన్నారు. మహారాష్ట్ర హోంమంత్రి, డీజీపీకి కూడా ఆయన లేఖ రాశారు.

దీనిపై మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ స్పందించారు. 38 మంది ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు భద్రత ఉపసంహరించాలని ముఖ్యమంత్రి గానీ, హోం శాఖ గానీ ఆదేశించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయంపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా స్పందించారు. భద్రత ఎమ్మెల్యేలకు మాత్రమే కల్పిస్తారని, వారి కుటుంబ సభ్యులకు కాదన్నారు. తమ పార్టీ చాలా పెద్దదని, దాన్ని ఎవ్వరూ హైజాక్ చేయలేరని అభిప్రాయపడ్డారు. ‘మా రక్తం ధారపోసి నిర్మించిన పార్టీ ఇది. దీని కోసం అనేక మంది ఎన్నో త్యాగాలు చేశారు. డబ్బుతో ఎవరూ దాన్ని విచ్ఛిన్నం చేయలేరు’ అని స్పష్టం చేశారు.

ఉద్ధవ్ థాకరే గూండాయిజం అంతం కావాలి.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవనీత్ కౌర్

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన కీలక నేత ఏక్ నాథ్ షిండే ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి గువాహటిలో క్యాంపు పెట్టారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలపై శివసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలకు తెరదీశాయి.

ఈ నేపథ్యంలో లోక్ సభ ఇండిపెండెంట్ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గూండాయిజాన్ని అంతం చేయాలని ఆమె అన్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. బాల్ థాకరే సిద్ధాంతాలను అనుసరిస్తూ, సొంత నిర్ణయాలు తీసుకుంటున్న రెబెల్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు హాని కలిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠించేందుకు నవనీత్ కౌర్ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఇద్దరూ కూడా కొన్ని రోజులు రిమాండ్ లో ఉండి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో థాకరేపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.

Leave a Reply

%d bloggers like this: