పిల్లిని రక్షించండి.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు అర్ధరాత్రి ఫోన్…

పిల్లిని రక్షించండి.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు అర్ధరాత్రి ఫోన్…
-చేదబావిలో పడిపోయిన పిల్లి
-పిల్లిని రక్షించేందుకు చిన్నారి స్నితిక, ఆమె తండ్రి విశ్వప్రయత్నం
-సీపీ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

సార్ పిల్లి బావిలో పడింది… రక్షించండంటూ అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఓ ఫోన్ కాల్ పట్ల కరీంనగర్ పోలీస్ కమిషనర్ అంతే వేగంగా స్పందించారు. ఆ పిల్లిని ప్రాణాలతో కాపాడగలిగారు. వివరాల్లోకి వెళ్తే, ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. అయితే కాస్త ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ విద్యానగర్ లోని కేడీసీసీ బ్యాంక్ వద్ద మనోహర్ కుటుంబం నివాసం ఉంటోంది. వారి ఇంటి వెనుక ఎవరూ వినియోగించని ఒక చేదబావి ఉంది. ఇంటి పరిసరాల్లో ఉండే రెండు పిల్లులు ఆదివారం సాయంత్రం పోట్లాడుకుంటుండగా… ఒక పిల్లి బావిలో పడిపోయింది.

పిల్లి పడిపోయిన విషయాన్ని గమనించిన మనోహర్ కుమార్తె స్నితిక (పదో తరగతి చదువుతోంది) తన తండ్రికి చెప్పింది. వారిద్దరూ గూగుల్ లో వెతికి జంతు సంరక్షణ సమితిని ఆశ్రయించారు. ఫోన్ ద్వారా వారిచ్చిన సూచనల మేరకు థర్మాకోల్ షీట్ ను బావిలో వేసి పిల్లిని బయటకు తీసుకొచ్చేందుకు చాలా సేపు ప్రయత్నించి, విఫలమయ్యారు.

ఆ తర్వాత జంతుసంరక్షణ సమితి సూచనల మేరకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీపీ సత్యనారాయణకు, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో కూడా పోలీస్ కమిషనర్ చాలా వేగంగా స్పందించారు. పిల్లిని రక్షించే బాధ్యతను ఏసీపీ శ్రీనివాస్ రావుకు అప్పగించారు. ఆ తర్వాత అర్ధరాత్రి 12.30 గంటలకు జాలి గంపను బావిలోకి దింపి పిల్లిని సురక్షితంగా బయటకు తీయడంతో… కథ సుఖాంతమయింది. పిల్లిని రక్షించేందుకు చిన్నారి పడిన తపనను, పోలీసు అధికారులు స్పందించిన తీరును అందరూ అభినందిస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: