పురిటి నొప్పులతో విలవిల్లాడిన గర్భిణి.. టెర్రస్‌పై విందు చేసుకున్న వైద్యులు!

పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణి.. టెర్రస్‌పై విందు చేసుకున్న వైద్యులు!

  • పార్టీలో మునిగిపోయిన వైద్యులు, సిబ్బంది
  • తీరిగ్గా గంట తర్వాత వచ్చి గర్భిణిని పరీక్షించిన వైద్యులు
  • గర్భంలోనే శిశువు మృతి చెందిందని చెప్పడంతో ఆగ్రహం
  • ఆసుపత్రిలో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు

కాన్పు కోసం ఆసుపత్రిలో చేరిన గర్భిణికి పురిటి నొప్పుల కోసం ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు.. తీరా అవి వచ్చేసరికి పత్తాలేకుండా పోయారు. టెర్రస్‌పై పార్టీ చేసుకున్నారు. వారు వచ్చే లోపు తల్లి గర్భంలోని శిశువు మృతి చెందింది. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట గోల్నాక ప్రాంతానికి చెందిన సయ్యద్ అరిఫ్ భార్య సురయ్య ఫాతిమా (24) కాన్పు కోసం ఈ నెల 24న చాదర్‌ఘాట్‌లోని అక్బర్ టవర్స్‌లోని ఇంతియాజ్ ఆసుపత్రిలో చేరింది. పురిటి నొప్పుల కోసం ఈ నెల 26న ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో అదే రోజు రాత్రి 9 గంటలకు ఫాతిమాకు నొప్పులు ప్రారంభమయ్యాయి.

దీంతో వైద్యులను పిలుచుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు వెళ్లగా వైద్యులు, సిబ్బంది ఎవరూ కనిపించలేదు. వారి కోసం వెతుకుతూ టెర్రస్‌పైకి వెళ్తే పార్టీ చేసుకుంటూ కనిపించారని ఫాతిమా కుటుంబ సభ్యులు ఆరోపించారు. మ్యూజిక్ సిస్టం పెట్టుకుని డ్యాన్సులు చేస్తూ పార్టీ చేసుకున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. గంట తర్వాత తీరిగ్గా వచ్చిన వైద్యులు ఫాతిమాను పరీక్షించి గర్భంలోనే శిశువు మృతి చెందిందని చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు.

సకాలంలో రాకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. వచ్చే నెలలో ఆసుపత్రి యజమాని కుమార్తె వివాహం ఉండడంతో వైద్యులు, సిబ్బంది పార్టీలో మునిగిపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రిని మూసేయాలని ఫాతిమా భర్త అరిఫ్ డిమాండ్ చేశారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Doctors negligence costs fetal dead in mothers womb

Leave a Reply

%d bloggers like this: