కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి జులై 1న బీజేపీలోకి మాజీ ఎంపీ…?

కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డితో బండి సంజ‌య్‌, త‌రుణ్ చుగ్ భేటీ!.. జులై 1న బీజేపీలోకి మాజీ ఎంపీ?
-హైద‌రాబాద్‌లో విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఇంటికెళ్లిన బీజేపీ నేత‌లు
-కొండాతో బండి, చుగ్‌లు గంట‌కు పైగా స‌మావేశం
-బీజేపీలోకి రావాల‌ని కొండాకు ఆహ్వానం
-అందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారంటూ ప్రచారం …

తెలంగాణ‌లోని చేవెళ్ల నుంచి ఓ ద‌ఫా లోక్‌స‌భ‌కు ఎన్నికైన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డితో బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ త‌రుణ్ చుగ్‌, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌లు బుధ‌వారం భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లోని విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఇంటికి వెళ్లిన బీజేపీ నేత‌లు ఆయ‌న‌తో ఏకంగా గంట‌కు పైగా స‌మావేశం అయ్యారు. బీజేపీలోకి రావాలని వారు మాజీ ఎంపీని కోరారు. వారి ప్ర‌తిపాద‌న‌కు విశ్వేశ్వ‌ర‌రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించిన‌ట్లు స‌మాచారం. జులై 1న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో బీజేపీలో చేరేందుకు ఆయ‌న సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అప్ప‌టిదాకా విజ‌య‌వంత‌మైన పారిశ్రామిక‌వేత్త‌గా గుర్తింపు సంపాదించుకున్న విశ్వేశ్వ‌ర‌రెడ్డి.. 2013లో టీఆర్ఎస్‌లో చేరారు. 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చేవేళ్ల లోక్ స‌భ స్థానం నుంచి ఆయ‌న టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నిలిచి విజ‌యం సాధించారు. అయితే 2018లో ఆయ‌న టీఆర్ఎస్‌తో విభేదించి పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇమ‌డ‌లేక 2021 మార్చిలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఏడాదిగా ఆయ‌న ఏ పార్టీలో లేకుండానే సాగుతున్నారు. అయితే విశ్వేశ్వ‌రరెడ్డి బీజేపీలో చేర‌తారంటూ ఏడాదిగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

బీజేపీలో చేరేందుకుఆయనకు అభ్యంత‌రం లేకున్నా… ఆ పార్టీ భావ‌జాలం, పార్టీలో త‌న‌కు ద‌క్కే గుర్తింపు త‌దిత‌రాల‌పై ఆయ‌న ప‌లు సందేహాలు వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. బుధ‌వారం నాటి భేటీలో బీజేపీ నేత‌లు ఆయ‌న అనుమానాల‌ను నివృత్తి చేసిన‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో పార్టీలో ఆయ‌న‌కు త‌గినంత గుర్తింపు ఇస్తామ‌ని చెప్పిన బీజేపీ నేత‌లు… అక్క‌డిక‌క్క‌డే జేపీ న‌డ్డాతో ఫోన్‌లో మాట్లాడించిన‌ట్లుగా స‌మాచారం. దీంతో జులై 1న బీజేపీలో చేరేందుకు విశ్వేశ్వ‌రరెడ్డి సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా అటు బీజేపీ నేతలుగాని , కొండా విశ్వేశ్వరరెడ్డి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు . అయితే ఆయన ఎప్పటినుంచో బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారు . బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా కూడా ఆయన వెళ్లి కలిశారు . హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ఈటల రాజేందర్ గెలుపులో కీలక పాత్ర పోషించారు .

Leave a Reply

%d bloggers like this: