తమ ప్రభుత్వాన్ని కూల్చండి చూస్తాం: బీజేపీకి కేసీఆర్ సవాల్

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు …
కూల్చండి చూస్తామంటూ … భాజపా నేతలకు కేసీఆర్ సవాల్
ఢిల్లీలో మిమ్మల్ని (భాజపా) గద్దె దింపుతామని హెచ్చరిక
కేంద్రం రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందని విమర్శ

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారని… కూల్చండి చూస్తామంటూ … కేసీఆర్ భాజాపా నేతలకు సవాల్ విసిరారు. ఢిల్లీలో మిమ్మల్ని (భాజపా) గద్దె దింపుతామని హెచ్చరించారు. మహారాష్ట్రలో చేసినట్టు తెలంగాణలో చేయడం అసాధ్యమని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టారని మండిపడ్డారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో యశ్వంత్ సిన్హాతో కలిసి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా ప్రధాని పదవిలో ఉంటానని మోదీ అనుకుంటున్నారని.. పదవులు ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు కచ్చితంగా వచ్చి తీరుతుందని అన్నారు.
మోదీ పాలనలో మన దేశం గౌరవాన్ని కోల్పోతోందని కేసీఆర్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ సహా అన్నింటి ధరలను మోదీ విపరీతంగా పెంచేశారని విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని.. పోరాట సమయంలో కొందరు రైతులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగిందని గుర్తు చేసారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు తాము రూ. 3 లక్షలు అందించామని తెలిపారు. బీజేపీ పాలనలో రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ బాధపడుతున్నారని అన్నారు.
మీ పాలనలో దేశానికి ఒనగూరింది ఏముందని మోదీని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. మోదీ కారణంగా శ్రీలంక ప్రజలు రోడ్డెక్కారని అన్నారు. అమెరికాలో ట్రంప్ ను సమర్థించి దేశ ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. మోదీ పాలనలో ప్రతి రంగం తిరోగమనంలోకి వెళ్లిపోయిందన్నారు చైనాతో పోల్చితే మనం ఎక్కడున్నామని కేసీఆర్ ప్రశ్నించారు. తాను వ్యక్తిగత విమర్శలు చేయడం లేదని… నిజాలే మాట్లాడుతున్నానని అన్నార్రు. స్వదేశీ బొగ్గును కాదని, విదేశాల బొగ్గును కొనాలంటూ రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు.
ఇచ్చిన హామీలను మోదీ ఏనాడైనా నెరవేర్చారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని … కేంద్ర ప్రభుత్వ తీరుపై తాము మౌనంగా ఉండబోమని… ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ప్రసంగాలు ఇవ్వడాన్ని మానేసి… హైదరాబాద్ వేదికగా తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

రాష్ట్రపతిగా సిన్హా అన్ని విధాలా అర్హుడు
మంచి వ్యక్తినే రాష్ట్రపతిగా ఎన్నుకోవాలి

ఒక మంచి వ్యక్తిని దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా ఆ పదవికి అన్ని విధాలా అర్హులని పేర్కొన్నారు. అడ్వొకేట్ గా తన కెరీర్ ను ప్రారంభించిన యశ్వంత్ సిన్హా ఆ తర్వాత ఐఏఎస్ అధికారిగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా అన్ని పదవుల్లో అద్భుతంగా రాణించారని అన్నారు. ఆర్థిక, విదేశాంగ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. రాష్ట్రపతిగా యశ్వంత్ సిన్హా గెలిస్తే దేశ గౌరవం మరింత ఇనుమడిస్తుందని చెప్పారు

Leave a Reply

%d bloggers like this: