Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు పై కక్ష పూరిత దాడులేనా?

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకు చెందిన మ‌ధుకాన్ గ్రూప్ ఆస్తుల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. ఇవి కేవలం కక్షపూరిత దాడులనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. టీఆర్ యస్ లోకసభ పక్షనేతగా ఆయన ఇటీవల కాలంలో కేసీఆర్ సూచనలకు అనుగుణంగా తన వాణిని గట్టిగా వినిపించారు. ఎప్పటి నుంచో నామను బీజేపీ టార్గెట్ చేస్తున్నట్ల వార్తలు వస్తున్నాయి. రూ.96 కోట్ల విలువైన ఈ ఆస్తులు ప‌శ్చిమ బెంగాల్‌, కృష్ణా, ప్ర‌కాశం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల‌తోపాటు హైద‌రాబాద్‌లో కూడా ఉన్నాయి. రాష్ట్రపతి పదవికి పోటీచేస్తోన్న య‌శ్వంత్ సిన్హా అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు ప‌లికిన టీఆర్ఎస్ నిన్న స‌మావేశం ఏర్పాటు చేసింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తోపాటు ఎంపీ నామా కూడా ఇందులో పాల్గొన్నారు. ఆయన ఇక్క‌డ ఉన్న స‌మ‌యంలోనే ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన‌ట్లు ఉత్త‌ర్వులు వెలువ‌డటం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ‌లో అధికారం చేజిక్కించుకోవాలంటే టీఆర్ ఎస్‌కు ఆర్థిక వ‌న‌రులుగా ఉన్న‌వారెవ‌రు? అనే అంశంపై బీజేపీ గురిపెట్టింద‌ని, మొత్తం ఒక జాబితా తెప్పించుకొని ఆ ప్ర‌కారం వ్యూహాల‌కు ప‌దును పెడుతోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు విడుద‌ల చేయ‌కుండా, అప్పులు రానివ్వ‌కుండా ఆర్థికంగా అల‌జ‌డి సృష్టించి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త తీసుకురావ‌డ‌మ‌నేది ఒక‌వైపు వ్యూహం కాగా, మ‌రోవైపు నుంచి పార్టీకి ఆర్థికంగా అండ‌దండ‌లందించినవారు, ఇప్పుడు అండగా ఉన్నవారెవ‌రు అనేదానిపై ఆ పార్టీ దృష్టిసారించింది.

2019 ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ఏవిధంగా కేసీఆర్ సాయం చేశారు? ఎటువైపు నుంచి నిధుల మ‌ళ్లింపు జ‌రిగింది? అనే విష‌యాల‌పై కూడా బీజేపీ ఆరా తీస్తున్న‌ట్లు స‌మాచారం. అన్నిర‌కాలుగా తెలంగాణ రాష్ట్ర స‌మితిని ఆర్థిక దిగ్బంధ‌నం చేసిన త‌ర్వాతే బీజేపీ మొద‌టి అడుగు వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నీవు నేర్పిన విద్య‌యే నీర‌జాక్షా అన్న రీతిలో ఇన్ని సంవ‌త్స‌రాలుగా తాను మ‌నుగ‌డ సాగించ‌డం కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో అదే చేసి అదే రీతిలో ఆ పార్టీని దెబ్బ‌కొట్టాల‌న్న‌దే బీజేపీ ల‌క్ష్యంగా ఉన్న‌ట్లు ఆ పార్టీ నేత‌లు వెల్ల‌డించారు.

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు త‌ర్వాత మ‌రొక సీనియ‌ర్ నేత‌పై బీజేపీ దృష్టిసారించిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న‌కు సంబంధించిన అన్నిర‌కాల వ్యాపారాలు, వాటి లొసుగులు త‌దిత‌రాల‌న్నింటినీ ఆరా తీస్తోంద‌ని, త‌ర్వాత టార్గెట్ ఆయ‌నే అవుతార‌ని టీఆర్ఎస్ ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టీఆర్ఎస్‌కు కూడా ఆయ‌న్ను టార్గెట్ చేస్తార‌ని తెలుస‌ని, అందుకే అన్నిర‌కాలుగా ఆ నేత‌ను అప్ర‌మ‌త్తం చేసింద‌ని చెబుతున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, క‌విత‌, హ‌రీష్‌రావు త‌ర్వాత ఆయ‌నే పార్టీకి, ప్ర‌భుత్వానికి కీల‌క‌మ‌ని చెబుతారు. దాడులు జరిగిన తర్వాతే ఆయన పేరు బయటకు రానుంది.

Related posts

అత్యాధునిక పరికరాలతో సరిహద్దులను కట్టుదిట్టం చేస్తున్న బీఎస్ఎఫ్!

Drukpadam

మరో ఏడాది వరకు హెచ్1బీ, ఇతర వర్క్ వీసాలకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలను రద్దు చేసిన అమెరికా విదేశాంగ శాఖ  !

Drukpadam

శ్రీలంక నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన రణిల్ విక్రమసింఘే…

Drukpadam

Leave a Comment