వాచీ దొంగతనం చేశాడని అనుమానం.. విద్యార్థిని కొట్టి చంపిన టీచర్లు!

వాచీ దొంగతనం చేశాడని అనుమానం.. విద్యార్థిని కొట్టి చంపిన టీచర్లు!
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఘటన
అడ్మిషన్ కోసం వెళ్లిన విద్యార్థిపై వాచీ దొంగతనం అభియోగం
గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టిన టీచర్లు
నిందితులపై కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ

వాచీ దొంగిలించాడన్న అనుమానంతో 15 ఏళ్ల విద్యార్థిని ముగ్గురు ఉపాధ్యాయులు కొట్టి చంపారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని పాషిమ్ మడైయా గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. దిల్షన్ అలియాస్ రాజా అనే 15 ఏళ్ల విద్యార్థి ఈ నెల 23న అడ్మిషన్ కోసం ఆర్ఎస్ ఇంటర్ కాలేజీకి వెళ్లాడు. ఆ తర్వాత వాచ్ దొంగతనం జరిగిందంటూ శివకుమార్ యాదవ్ అనే టీచర్ తన కొడుకును తీసుకెళ్లాడని బాలుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సహ ఉపాధ్యాయులైన ప్రభాకర్, వివేక్ యాదవ్‌లతో కలిసి శివకుమార్ బాలుడిని గదిలో బంధించి దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన రాజాను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి కాన్పూరు తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కున్వర్ అనుపమ్ సింగ్ పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: