దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర – భట్టీ


దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర

దేశాన్ని విభజన చేయాలని చూస్తున్న మోడీ

దేశంలో మరో మతం ఉండకూడదనేది బిజెపి దుష్ట ఆలోచన

లౌకిక వాదానికి తూట్లు పొడుస్తున్న మోడీ సర్కార్

మరో సంగ్రామ పోరాటానికి యువత సిద్ధమవ్వాలి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపు

మోడీ పరిపాలనకు చరమగీతం పాడుదాం: మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్

ఐదో రోజు సత్తుపల్లి నియోజకవర్గంలో కొనసాగిన ఆజాదీ కా గౌరవ్ యాత్ర

రాజకీయ లబ్ధి కోసం దేశ విభజన చేయాలని చూస్తున్న మోడీ విధానాలను ఎండగడుతూ దేశ సమైక్యత కోసం, స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించడానికి రాహుల్ గాంధీ
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జూడో యాత్ర చేపడుతున్నారని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. 75 వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆజాదీ కా గౌరవ్ యాత్ర 5వ రోజు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తో కలిసి శనివారం సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడు మండలం వెంకటగిరి క్రాస్ రోడ్ ఆర్.భి గార్డెన్స్ నుంచి భట్టి ప్రారంభించారు. అంజనాపురం, మిట్టపల్లి, పాయపుర్, హనుమాన్ తండా, కల్లూరు‌ మీదుగా రాత్రికి ఖాన్ ఖాన్ పేట కు పాదయాత్ర చెరుకున్నది. ఈ సందర్భంగా తల్లాడ, కల్లూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి మాట్లాడారు. లౌకికవాదానికి తూట్లు పొడుస్తూ హిందుత్వం తప్ప దేశంలో మరొక మతం ఉండకూడదన్న బిజెపి చేస్తున్న దుర్మార్గమైన కుట్రలను తిప్పి కొట్టడానికి రాహుల్ గాంధీ పాదయాత్ర దోహధ పడుతుందన్నారు. దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జూడో యాత్రలో ప్రజలు భాగస్వామ్యమై మోడీని గద్దె దించడానికి సమయాతం కావాలని కోరారు. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి పారద్రోలి బానిసత్వం నుంచి ప్రజలను కాంగ్రెస్ పార్టీ విముక్తి చేసి స్వాతంత్రం తీసుకు వచ్చిందన్నారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కార్ ఎనిమిదేళ్ల పరిపాలనలో దేశంలోని ఆస్తులు, సంపదను, అంబానీ, ఆదానీలకు దార దత్తం చేస్తూ ప్రజలను మరోసారి బహుళజాతి సంస్థల వద్ద తాకట్టుపెట్టి బానిసత్వంలోకి తీసుకుపోతున్నదని మండిపడ్డారు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం వేల కోట్ల రుణాలు మాఫీ చేసి దేశ ప్రజలపై నిత్యవసర, ఆహార వస్తువులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి భారం మోపుతున్న బిజెపి పాలన ఈ దేశానికి అవసరమా? ప్రజలు ఆలోచించాలన్నారు. గ్యాస్ సిలిండర్ ను 450 రూపాయలు ఇచ్చినటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కావాలా? గ్యాస్ సిలిండర్ ధరను 1100 కు పెంచిన మోడీ పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరిట బహుళ జాతి సంస్థలకు దారా దత్తం చేస్తున్న మోడీ నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నాడని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. *ప్రశ్నిస్తే ఈ.డి, ఐ.టీ, సి బి ఐ, పోలీస్ కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టి వేసిన మోడీ పరిపాలన ఈ దేశానికి అవసరమే లేదన్నారు. దేశాన్ని కాపాడుకోవడం కోసం స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తితో మరో ఉద్యమానికి యువతరం కదం తొక్కాలని పిలుపు నిచ్చారు.

మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మతతత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న మోడీ పరిపాలనకు చరమగీతం పాడటానికి కాంగ్రెస్ చేపడుతున్న పాదయాత్రలో నాంది పలుకుతాయన్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఏలాంటి పాత్ర లేనటువంటి బిజెపి తామే స్వాతంత్రం తీసుకు వచ్చిన చందంగా వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ, పాదయాత్రల ద్వారా కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆజాదీ కా అమృత్ గౌరవ్ యాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: