Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీసీ సాధికారిక సమావేశంలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు!

జగన్ రెడ్డీ… నీ పైశాచిక ఆనందం తాత్కాలికమే… మేం మళ్లీ వస్తాం… అప్పుడు చెబుతాం నీ కథ!: చంద్రబాబు

  • బీసీ సాధికారిక సమావేశంలో చంద్రబాబు ప్రసంగం
  • సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత
  • పెద్ద మగాడివి అనుకుంటున్నావా అంటూ ఆగ్రహం
  • హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తీవ్రస్థాయిలో ధ్వజం

టీడీపీ బీసీ సాధికారిక కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, టీడీపీలో బీసీలకు ప్రాముఖ్యత ఇస్తున్నామని, వెనుకబడిన వర్గాల నుంచి బలమైన నాయకత్వాన్ని తయారుచేశామని చెప్పారు.

కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, పీతాని
సత్యనారాయణ… ఈ విధంగా ఎంతోమందికి అవకాశాలు ఇవ్వడం ద్వారా నాయకత్వాన్ని పెంచామని వివరించారు. అధికారాన్ని ఇచ్చి ప్రోత్సహించామని, వెనుకబడిన వర్గాలను శక్తిమంతం చేసేందుకు కృషి చేశామని అన్నారు.

టీడీపీ రుణపడి ఉందంటే అది వెనుకబడిన వర్గాలకేనని స్పష్టం చేశారు. అనేక వర్గాలు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ టీడీపీ వెన్నంటే ఉన్నది వెనుకబడిన వర్గాలేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. నాడు ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాల వారికి స్థానిక సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్లు ఇస్తే, తాను సీఎం అయ్యాక ఆ రిజర్వేషన్లను 34 శాతం చేశానని వెల్లడించారు. తద్వారా నూటికి 34 మంది బీసీలే ఉండే పరిస్థితి తీసుకొచ్చామని అన్నారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 34 శాతం బీసీ రిజర్వేషన్లను 24 శాతం చేశాడని చంద్రబాబు ఆరోపించారు. తద్వారా సర్పంచిల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు 16,800 మంది పదవుల్లో కోత పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కానీ బీసీలను బలహీనపరిచే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.

ఓసారి కేంద్ర ప్రభుత్వంలో చేరే అవకాశం వచ్చిందని, అప్పుడు బీసీ నేత అయిన ఎర్రన్నాయుడుకే కేంద్ర మంత్రి అవకాశం ఇచ్చామని వెల్లడించారు. అది కూడా ఉత్తరాంధ్రకే ఆ అవకాశం కల్పించామని చెప్పారు. స్పీకర్ పదవి, రెవెన్యూ మంత్రి పదవి, హోంమంత్రి పదవి (దేవేందర్ గౌడ్) బీసీలకే ఇచ్చామని గుర్తుచేశారు.

ఇక, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు అంశంపైనా చంద్రబాబు ఈ వేదిక నుంచి స్పందించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ వర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టేంతవరకు టీడీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నేను మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదట… ఈయనొచ్చి పెట్టాడట అంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ అడ్డంగా మాట్లాడి దొరికిపోతున్నాడని వ్యాఖ్యానించారు.

ఏపీలో ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. ధరలన్నీ పెరిగిపోయాయని, అన్నింటిపైనా బాదుడే బాదుడు అని వ్యాఖ్యానించారు. “ఎవరైనా భరించే పరిస్థితిలో ఉన్నారా? పెట్రోల్, డీజిల్, వంటగ్యాసు ధరలు పెరిగాయి. ఇంటిపన్ను పెరిగింది, చెత్త పన్ను కూడా పెంచారు… ఇంకేం మిగిలింది… ఏమీ మిగల్లేదు. ఇదంతా ఎక్కడికి పోయింది? జగన్ మోహన్ రెడ్డి జేబుల్లోకి పోతూ ఉంది.

ఇది బటన్ నొక్కడం కాదు.. బటన్ అవుట్ కంటే బటన్ ఇన్ ఎక్కువైంది. సాయంత్రం అయితే తాడేపల్లిలో కూర్చుని గల్లా పెట్టె చూసుకుంటున్నాడు. త్వరలో పొట్ట పగిలి డబ్బులన్నీ బయటికి వస్తాయి. పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా మద్యాన్ని ఏరులై పారిస్తున్నావు. ఆ రోజున ఏం చెప్పావు… మద్యపాన నిషేధం అన్నావు. నోరు విప్పితే అన్నీ అబద్ధాలే… ఏ లగ్నాన పుట్టాడో! ఇవాళ్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంలోనూ అబద్ధాలే!

హెల్త్ యూనివర్సిటీకి నేను ఎన్టీఆర్ పేరును 1998లో పెట్టాను. రాష్ట్రంలో వైద్య విద్యలో నిపుణతను పెంచడానికి ఓ వర్సిటీ ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆ విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా హెల్త్ యూనివర్సిటీ తెచ్చిన ఘనత ఎన్టీఆర్ కే చెల్లుతుంది. కానీ ఇవాళ ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టాడు.

నేను మెడికల్ కాలేజీలు పెట్టలేదట.. ఈయనొచ్చి పెట్టాడట. ఆ రోజున మేం తలుచుకుని ఉండుంటే కడప జిల్లాకు రాజశేఖర్ రెడ్డి పేరు ఉండేదా? హార్టీకల్చర్ కళాశాలకు రాజశేఖర్ రెడ్డి పేరును మేం తొలగించామా? ఏం మాకు చేతకాదనుకున్నావా? నువ్వే పెద్ద మగాడివా? హెల్త్ వర్సిటీ పేరు మార్చినందువల్ల నీ నీచబుద్ధి బయటపడిందే తప్ప, నీ హుందాతనం పెరగలేదు జగన్ రెడ్డీ.

నీ చేతకాని దద్దమ్మ పనులకు నన్ను విమర్శించే హక్కు లేదు. నువ్వు సొంతంగా కాలేజీలు కట్టుకుని వాటికి నీ తండ్రి పేరు పెట్టుకో.. నాకేం బాధలేదు. కడపలో స్టీల్ ప్లాంట్ కట్టుకుని దానికి నీ తండ్రి పేరు పెట్టుకో.. నాకేం బాధలేదు.. ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి నీ తండ్రి పేరు పెట్టుకో… అందుకు కూడా నాకేం బాధలేదు. కనీస అభివృద్ధి చేయకపోగా, ఇప్పుడు మళ్లీ పేర్లు మార్చడం కూడానా స్టిక్కర్ ముఖ్యమంత్రీ.

మేం కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేస్తాడు, రంగులు మార్చేస్తాడు. ఇప్పుడు ఏకంగా పేర్లే మార్చేస్తున్నాడు. 1986లో స్థాపించిన మెడికల్ వర్సిటీకి పెట్టిన పేరు తీసేస్తావా? మేం మళ్లీ వస్తాం… అప్పుడు చెబుతాం నీ కథ. నీ పైశాచిక ఆనందం తాత్కాలికమే” అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Related posts

అమరావతి ఉద్యమానికి 600 రోజులు…ఉద్యమకారుల ర్యాలీ నిరాకరించిన పోలీసులు!

Drukpadam

కాంగ్రెస్ పార్టీ కమిటీకి కొండా సురేఖ షాక్ …

Drukpadam

బీజేపీకి అధికారం ఇవ్వండి.. నాణ్యతతో కూడిన క్వార్టర్ లిక్కర్ రూ.50కే ఇస్తాం: సోము వీర్రాజు

Drukpadam

Leave a Comment