కాంగ్రెస్ అధ్యక్ష రేసులోకి మరికొందరు సీనియర్లు!

కాంగ్రెస్ అధ్యక్ష రేసులోకి మరికొందరు సీనియర్లు!

  • తెరపైకి కమల్ నాథ్, మనీశ్ తివారీ, ఖర్గే, సిద్ధరామయ్య పేర్లు
  • మొన్నటిదాకా రేసులో ముందంజలో ఉన్న అశోక్ గెహ్లాట్
  • రాహుల్ కాదంటే ఎన్నిక అనివార్యం అయ్యే అవకాశం

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోంది. ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావహుల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా మరికొందరు సీనియర్లు కూడా రేసులోకి వస్తున్నారు. రాహుల్ గాంధీ కాదంటే అధ్యక్ష పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ముందంజలో ఉన్నారు. ఆయనకు పోటీగా కేరళ ఎంపీ శశిథరూర్ పేరు వినిపించింది. అనంతరం యూపీ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పేరు వినిపించింది.

ఈ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, మరో సీనియర్ నేత మనీశ్ తివారీ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. వీరితో పాటు సీనియర్లు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, పృథ్వీరాజ్ చౌహాన్, ముకుల్ వాస్నిక్ కూడా రేసులోకి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలంటూ ఇప్పటికే దాదాపుగా 8 రాష్ట్రాల పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. మరిన్ని రాష్ట్రాల పీసీసీలు కూడా ఇదే తరహా తీర్మానాలు ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంది. పోటీలో బరిలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే… అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహించి అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడిస్తారు.

Leave a Reply

%d bloggers like this: