సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించిన న్యాయస్థానం..

సీనియర్ జర్నలిస్టు అంకబాబుకు ఊరట… సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన న్యాయస్థానం

  • ప్రభుత్వ వ్యతిరేక పోస్టు ఆరోపణలపై అంకబాబు అరెస్ట్
  • పలు సెక్షన్లతో కేసు నమోదు
  • గుంటూరు కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

ఇటీవల గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేతపై ప్రభుత్వ వ్యతిరేక పోస్టును వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారన్న ఆరోపణలపై సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. 73 ఏళ్ల అంకబాబుపై ఐపీసీ 153 (ఏ), 505 (2), రెడ్ విత్ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో, ఆయనను సీఐడీ పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అంకబాబును రిమాండ్ కు తరలించాలని సీఐడీ వాదనలు వినిపించింది. అయితే, ఆయనను ఎందుకు తీసుకువచ్చారని, అంకబాబుకు సీఆర్పీపీసీ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని సీఐడీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. సీఐడీ పోలీసులు స్పందిస్తూ, నోటీసులు ఇస్తే అంకబాబు తీసుకోలేదని కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన అంకబాబు తనకెలాంటి నోటీసులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కోర్టు సీఐడీ పోలీసుల రిమాండ్ రిపోర్టును తిరస్కరించింది.

ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో కోర్టు రిమాండ్ పిటిషన్ ను తోసిపుచ్చింది. వాదనల సందర్భంగా, అంకబాబుపై గతంలో 20 కేసులు ఉన్నాయని సీఐడీ పేర్కొంది. అయితే కేసుల ప్రాథమిక వివరాలు సమర్పించాలని న్యాయమూర్తి సీఐడీ పోలీసులకు స్పష్టం చేశారు. అంకబాబుకు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి వదిలేయాలని సీఐడీ పోలీసులను ఆదేశించారు.

Leave a Reply

%d bloggers like this: