పదవి విరమణ తర్వాతనే తనకు స్వాతంత్యం వెంకయ్యనాయుడు ఆసక్తి వ్యాఖ్యలు ..

పదవీ విరమణ చేసిన తర్వాతే నాకు స్వాతంత్య్రం వచ్చినట్టు అనిపిస్తోంది: వెంకయ్యనాయుడు

  • ఇటీవల భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య పదవీవిరమణ
  • నెల్లూరులో ఆత్మీయ అభినందన సభ
  • హాజరైన వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ బిర్లా
  • తనకు అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయన్న వెంకయ్య

భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఇటీవల పదవీవిరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు నెల్లూరులో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన తర్వాతే తనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రోటోకాల్ ఇబ్బందులేవీ లేవని, స్వేచ్ఛగా ఎవరినైనా కలవగలనని పేర్కొన్నారు. తనకు అన్ని పార్టీల నేతలతో సత్ససంబంధాలు ఉన్నాయని వెంకయ్యనాయుడు వెల్లడించారు. రాజకీయాల్లో శత్రువులు ఉండరని, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారన్న అంశాన్ని అన్ని పార్టీల నేతలు గ్రహించాలని సూచించారు.

చట్టసభల్లో జరుగుతున్న పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయని, ఏదైనా అంశంపై చర్చించి అభిప్రాయాలను పంచుకోవాలే తప్ప, వ్యక్తిగత దూషణలు చేయకూడదని హితవు పలికారు. ఇక, నెల్లూరు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని చెబుతూ వెంకయ్య భావోద్వేగాలకు గురయ్యారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మిత్రులను, అభిమానులను కలుస్తుంటానని తెలిపారు.

అటు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తూ… నెల్లూరు జిల్లాలోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన వెంకయ్యనాయుడు భారత ఉపరాష్ట్రపతిగా ఎదిగారని, క్రమశిక్షణ, అంకితభావానికి నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. వెంకయ్యను తాము గురువులా భావిస్తామని, అలాంటి గొప్ప వ్యక్తితో సన్నిహితంగా మెలిగే అవకాశం తనకు కలిగిందని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: