హెల్త్ ప్లాన్లలో టాపప్ – సూపర్ టాపప్ వేర్వేరు!

హెల్త్ ప్లాన్లలో టాపప్ – సూపర్ టాపప్ వేర్వేరు!

  • హాస్పిటల్ బిల్లు బీమా కవరేజీని మించితే..?
  • అటువంటి సందర్భాల్లో ఆదుకునేవే టాపప్, సూపర్ టాపప్
  • టాపప్ ప్రతి క్లెయిమ్ కి విడిగా అమలవుతుంది
  • సూపర్ టాపప్ అన్ని బిల్లులూ కలిపి చూస్తుంది

నేడు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ప్రతి ఒక్కరికీ, ప్రతి కుటుంబానికి అవసరమైపోయింది. కరోనా అనుభవంతో.. ఎప్పుడు ఏ రూపంలో ఆరోగ్య అత్యవసర స్థితి ఏర్పడుతుందో చెప్పలేకున్నాం. అలాగే, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చికిత్స అవసరమైన సందర్భాల్లోనూ హెల్త్ ఇన్సూరెన్స్ ఆదుకుంటుంది. అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్  ప్రాధాన్యంపై ఇటీవలి కాలంలో అవగాహన అధికమవుతోంది.

ఎంత మేర..?
ఒక కుటుంబానికి ఎంత మేర హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అవసరం? ఇదే అసలు ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ చూడాల్సిన అంశాలు ఏమిటంటే..? అప్పటికే వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని. ఉంటే కనుక కవరేజీ కొంచెం అధికంగానే తీసుకోవాలి. రెండోది వయసు. చిన్న వయసులో ఆరోగ్య సమస్యలు ఉండవు. పెద్ద వయసుకు వస్తుంటే ఒక్కో సమస్య కనిపిస్తుంటుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా, తీసుకునే కవరేజీకి ప్రీమియం చెల్లించగలమా? వీటన్నింటినీ బేరీజు వేసుకుని, తాము ప్రీమియం చెల్లించగల సామర్థ్యం మేరకు, కనీసం రూ.5 లక్షలకు తక్కువ కాకుండా కవరేజీ తీసుకోవాలి.

టాపప్, సూపర్ టాపప్
ఒక కుటుంబానికి రూ.20 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకుందాం. అప్పుడు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అధిక ప్రీమియం భరించే సామర్థ్యం అందరికీ ఉండకపోవచ్చు. ఇలాంటి వారు రూ.5 లక్షలకు బేసిక్ ప్లాన్ తీసుకుని, టాపప్ లేదా సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. బేసిక్ హెల్త్ ప్లాన్ లో కవరేజీ తీరిపోయిన సందర్భాల్లో అదనపు మొత్తాలను ఇవి చెల్లిస్తాయి. పైగా వీటి ప్రీమియం చాలా తక్కువ.

కానీ, టాపప్, సూపర్ టాపప్ మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు రామ్ చరణ్ అనే వ్యక్తి రూ.5 లక్షల కవరేజీతో బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్ తీసుకున్నాడని అనుకుందాం. రామ్ చరణ్ స్నేహితుడు అర్జున్ కూడా రూ.5 లక్షల బేసిక్ కవరేజీ తీసుకున్నాడు. ఇప్పుడు చరణ్ రూ.5 లక్షల డిడక్టబుల్ తో రూ.50 లక్షల టాపప్ ప్లాన్ తీసుకున్నాడు. అంటే క్లెయిమ్ రూ.5 లక్షలు దాటినప్పుడు అదనపు మొత్తాన్ని టాపప్ చెల్లిస్తుంది. కానీ, అర్జున్ సూపర్ టాపప్ ను రూ.5 లక్షల డిడక్టబుల్ కండీషన్ పై రూ.50 లక్షలకు తీసుకున్నాడు.

రామ్ చరణ్ ఒక సమస్యతో హాస్పిటల్ లో చేరాడు. బిల్లు రూ.7 లక్షలు వచ్చింది. అప్పుడు అతడి బేస్ ప్లాన్ రూ.5 లక్షలు చెల్లించగా, మిగిలిన రూ.2 లక్షలను టాపప్ ప్లాన్ చెల్లించింది. ఇదే సమస్యతో అర్జున్ హాస్పిటల్ లో చేరాడని అనుకుందాం. అప్పుడు కూడా బేస్ ప్లాన్ రూ.5 లక్షలు, సూపర్ టాపప్ రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఇక్కడ ఎలాంటి వ్యత్యాసం లేదు.

కానీ, ఇలా కాకుండా చరణ్ ఒకే పాలసీ సంవత్సరంలో రెండు సార్లు హాస్పిటల్ లో చేరి బిల్లు రూ.4 లక్షల చొప్పున రెండు సార్లు వచ్చిందని అనుకుందాం. అప్పుడు మొదటి సారి బేస్ ప్లాన్ రూ.4 లక్షలు చెల్లిస్తుంది. రెండో సారి చరణ్ చేరినప్పుడు బేస్ ప్లాన్ కవరేజీ అయిపోయిందని చెల్లింపులు రాకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే రూ.5 లక్షల డిడక్టబుల్ అన్నది అప్లయ్ అవుతుంది. అంటే బిల్లు మొత్తం రూ.5 లక్షలు మించిన సందర్భాల్లోనే టాపప్ చెల్లింపులు చేస్తుంది.

కానీ, సూపర్ టాపప్ అలా కాదు. ఎందుకంటే ఒక పాలసీ సంవత్సరంలో ఎన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పటికీ.. అన్నీ బిల్లులు కలిపి రూ.5 లక్షలు మించితే, అదనపు మొత్తాన్ని సూపర్ టాపప్ చెల్లిస్తుంది. టాపప్ మాత్రం ప్రతీ బిల్లు విడిగా రూ.5 లక్షలు దాటినప్పుడే అక్కరకు వస్తుంది.

ఒక పాలసీ సంవత్సరంలో ఒకసారి హాస్పిటల్ బిల్లు రూ.5 లక్షలు వచ్చి, రెండోసారి హాస్పిటల్ లో చేరడం వల్ల మరో రూ.4 లక్షలు బిల్లు వచ్చిందనుకోండి. అప్పుడు టాపప్ నుంచి రూపాయి రాదు. ఎందుకంటే రెండు సందర్భాల్లోనూ రూ.5 లక్షలు బిల్లు దాటలేదు కనుక. అదే సూపర్ టాపప్ తీసుకుని ఉంటే బేసిక్ ప్లాన్ లో రెండో సారి రూ.4 లక్షలు కవర్ కాకపోయినా, అది చెల్లిస్తుంది. పైగా టాపప్, సూపర్ టాపప్ ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది.

Leave a Reply

%d bloggers like this: