నందిగామలో చంద్రబాబు రోడ్ షోపై రాయి విసిరిన వ్యక్తి… చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలు!

నందిగామలో చంద్రబాబు రోడ్ షోపై రాయి విసిరిన వ్యక్తి… చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలు!

  • ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు
  • చంద్రబాబు నిలుచున్న వాహనంపైకి రాయి విసిరిన గుర్తు తెలియని వ్యక్తి
  • రాయి తగలడంతో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయాలు
  • మీ అంతు చూసేదాకా నిద్రపోనంటూ హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రోడ్ షోపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి తగలడంతో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నందిగామ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వాహనంపై విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి జనాలకు అభివాదం చేసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగారు.

ఈ సమయంలో చంద్రబాబు వెనకాలే నిలుచున్న మధుపై ఒక్కసారిగా రాయి పడింది. ఎటు వైపు నుంచి వచ్చిందో తెలియదు గానీ… మధుకు గాయాలను చేసింది. చంద్రబాబుకు కేంద్రం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సెక్యూరిటీ బృందానికి నేతృత్వం వహిస్తున్న మధుపైనే రాయి పడటం గమనార్హం. తనకు దెబ్బ తగలి రక్తం కారుతుండటంతో విషయాన్ని ఆయన చంద్రబాబుకు తెలిపారు.

మధుకు గాయం కావడం, ఆయన తల నుంచి రక్తం కారుతున్న దృశ్యాలను చూసిన వెంటనే కోపోద్రిక్తుడైన చంద్రబాబు… నాని చేతిలోని మైకును తీసుకుని తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. తన రోడ్ షోకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అంతు చూసే వరకు నిద్ర పోనంటూ రాయి విసిరిన వ్యక్తులను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చంద్రబాబు హెచ్చరించారు.

Leave a Reply

%d bloggers like this: