మానసిక ఆరోగ్యానికి దోహదపడే కీలకమైన పోషకాలు ఇవే!

మానసిక ఆరోగ్యానికి దోహదపడే కీలకమైన పోషకాలు ఇవే!

  • మానవ దేహానికి బలం చేకూర్చే వివిధ పోషకాలు
  • మెదడు ఆరోగ్యానికి కీలకం సూక్ష్మపోషకాలు
  • పోషకాలు లోపిస్తే మానసిక రుగ్మతలు
  • కొన్నిసార్లు డిప్రెషన్ కు దారితీసే పరిస్థితి

ఇప్పటి జీవనవిధానాన్ని అనుసరించి శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని వైద్య నిపుణులు చెబుతుంటారు. మనిషి మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కోగలడు. తన సామర్థ్యం మేరకు పనిచేయాలన్నా మానసికంగా బలంగా ఉండడం ఎంతో అవసరం.

ఈ ఏడాది జూన్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ మెంటల్ హెల్త్ నివేదికను విడుదల చేసింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. మానసికంగా ఉల్లాసంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించే యోగా, ధ్యానం ఆచరించడం, సంగీతం వినడం వంటి అలవాట్లను పెంపొందించుకోవాలని సూచిస్తుంటారు. అయితే, మానసిక ఆరోగ్యానికి కొన్ని సూక్ష్మపోషకాల అవసరం ఎంతో ఉందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

విటమిన్ డి పాత్ర కీలకం

మెదడు ఆరోగ్యానికి పలు పోషక పదార్థాలతో స్పష్టమైన సంబంధం ఉన్నట్టు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఒమెగా-3 యాసిడ్లు, ఫోలేట్, బి12తో కూడిన బి-విటమిన్లు, కోలైన్, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఎస్ అడెనోసిల్ మెథియోనైన్, విటమిన్ డి, అమినో యాసిడ్లు మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయని నిపుణులు చెప్పే మాట.

విటమిన్ డి కేంద్ర నాడీవ్యవస్థ కార్యకలాపాలనును నియంత్రిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ లోపాలు మానసిక కుంగుబాటుకు దారితీస్తాయి. ఈ నేపథ్యంలో, శరీరానికి తగినంత విటమన్ డి అందేలా చూసుకుంటే డిప్రెషన్ బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 2015-16లో నిర్వహించిన నేషనల్ మెంటల్ హెల్త్ సర్వేలో భారత్ లో ప్రతి 20 మందిలో ఒకరు మానసిక కుంగుబాటు (డిప్రెషన్)తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. డిప్రెషన్ తో బాధపడేవారి సంఖ్య కరోనా సంక్షోభం అనంతరం మరింత పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.

విటమిన్ సి కూడా ముఖ్యమే!  

విటమిన్ సి విషయానికొస్తే ఇది శరీరానికి తగిన వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడమే కాదు, అదే స్థాయిలో మెదడు ఆరోగ్యానికి కూడా సహాయకారిగా పనిచేస్తుంది. శరీరంలో విటమిన్ సి లోపిస్తే, మెదడులోని డోపమైన్, సెరటోనిన్ వంటి కీలక న్యూరోట్రాన్స్ మిటర్ల క్షీణత ఏర్పడుతుంది. తద్వారా పలు మానసిక రుగ్మతలు సంభవిస్తాయి. తగినంత విటమిన్ సి కలిగి ఉంటే ఆందోళన, కుంగుబాటు, బైపోలార్ డిజార్డర్ వంటి తగ్గుముఖం పడతాయి.

బి విటమిన్లలో ఉండే పదార్థాలు మానసిక స్పందనలపై బలంగా పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు మూడ్ మారిపోయే వారికి బి విటమిన్లు మంచి ఔషధం అని నిపుణులు చెబుతుంటారు. బి12 విటమిన్ లోపిస్తే అలసట, జ్ఞాపకశక్తి లోపంతో బాధపడుతుంటారు. బి12, బి6 విటమిన్లు, ఫోలేట్ లోపిస్తే అది డిప్రెషన్ కు దారితీస్తుంది. బి విటమిన్లతో మానసిక ఆరోగ్యానికి సంబంధించి సూక్ష్మ లోపాలను కూడా చక్కదిద్దవచ్చు.

భావోద్వేగాలను నియంత్రించే జింక్ 

జింక్ వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం మాత్రమే కాదు, మెదడు పనితీరుపైనా గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు, భావోద్వేగాలను కూడా ఇది నియంత్రిస్తుంది. జింక్ లోపంతో బాధపడేవారిలో అస్థిరమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. ఒత్తిడిని ఎదుర్కోలేరు. నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు కూడా బాధిస్తుంటాయి. దేనిపైనా శ్రద్ధ పెట్టలేరు. అలాంటివారికి జింక్ ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.

ఒమెగా-3 పోషకం మెదడును చురుగ్గా ఉంచడంలో తోడ్పడుతుంది. మెదడులో మృత కణాజాలం సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా మెదుడుపై వయోభారం పడకుండా చూస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో మానసిక ఎదుగుదలను ఒమెగా-3 ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ పాలీశాచురేటెడ్ ఒమెగా-3 యాసిడ్లు మనిషి ప్రవర్తన, వ్యక్తిత్వం, ఏకాగ్రత స్థాయులను నిర్దేశిస్తాయంటే ఇవి మెదడుకు ఎంత అవసరమో తెలుస్తుంది. స్కిజోఫ్రినియా వంటి మొండి వ్యాధుల నుంచి కోలుకోవడానికి ఒమెగా-3 ఎంతో ఉపయుక్తమని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Leave a Reply

%d bloggers like this: