అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ వసూలు చేశారు: కొడాలి నాని!
అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ వసూలు చేశారు: కొడాలి నాని!
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరన్న నాని
- అరబిందోతో సంబంధం లేదని చంద్రబాబు ప్రమాణం చేయాలని డిమాండ్
- 2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరివని వ్యాఖ్య
- జనసేనను చంద్రబాబుకు పవన్ అంకితం చేశారని ఆరోపణ
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సోదరుడేనని, శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ పై వైసీపీ ఏం సమాధానం చెబుతుందన్న టీడీపీ ప్రశ్నల నేపథ్యంలో గురువారం కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరని ఆయన అన్నారు. అరబిందో సంస్థతో చంద్రబాబుకూ సంబంధం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంపై దమ్ముంటే చంద్రబాబు ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. 2004 నుంచి 2019 దాకా అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ వసూలు చేశారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుపైనా కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబుకు జీవిత కాలం సమయం ఇస్తామని, ఈ సమయంలో పులివెందులలో కనీసం ఒక్క పంచాయతీనైనా గెలవాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు.
అసలు నారావారిపల్లెలోనే గెలవలేని చంద్రబాబు కుప్పంలో ఎలా గెలుస్తారని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ కొట్టిన దెబ్బకు చంద్రబాబుతో పాటు లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు రాజకీయ అనాథలు అయ్యారన్నారు. జనసేనను పవన్ కల్యాణ్… చంద్రబాబుకు అంకితం చేశారన్నారు. 2024 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ తన పార్టీ జెండా పీక్కొని వెళ్లిపోతారని నాని అన్నారు.