శ్రీవారి లడ్డూ బరువుపై టీడీపీ విమర్శలు… వివరణ ఇచ్చిన టీటీడీ!

శ్రీవారి లడ్డూ బరువుపై టీడీపీ విమర్శలు… వివరణ ఇచ్చిన టీటీడీ!

  • తిరుమలలో లడ్డూ కౌంటర్ వద్ద ఓ భక్తుడి ఆగ్రహం
  • లడ్డూ కేవలం 90 గ్రాముల బరువు తూగిన వైనం
  • జగన్, వైవీ చీటింగ్ చేస్తున్నారన్న భక్తుడు
  • వీడియో పంచుకున్న తెలుగుదేశం పార్టీ
  • స్పందించిన టీటీడీ

తిరుమలలో భక్తులకు అందించే శ్రీవారి లడ్డూ ప్రసాదం బరువు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. దొంగలకు అధికారం ఇవ్వడం అంటే దోపిడీకి అనుమతి ఇచ్చినట్టేనని జగన్ అండ్ కో నిరూపిస్తోందని టీడీపీ విమర్శించింది. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూలోనూ వారు దోపిడీని వెదుక్కోవడం దారుణం అని పేర్కొంది.

175 గ్రాములు ఉండాల్సిన తిరుపతి లడ్డూ బరువు ఎంత తూగిందో మీరే చూడండి అంటూ టీడీపీ ఓ వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో… తిరుమలలోని లడ్డూ కౌంటర్ వద్ద భక్తుడికి, కౌంటర్ సిబ్బందికి మధ్య లడ్డూల బరువు విషయమై వాదోపవాదాలు జరిగిన విషయం కనిపించింది.

లడ్డూలు చిన్నవిగా ఉండడాన్ని సదరు భక్తుడు నిలదీశాడు. దాంతో కౌంటర్ లో ఉన్న ఉద్యోగి ఓ లడ్డూను వెయింగ్ మెషీన్ పై ఉంచగా, అది 90 గ్రాములు తూగినట్టు కనిపించింది. దాంతో ఆ భక్తుడు ఇది చీటింగ్ అని మండిపడ్డాడు. వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి కలిసి చేస్తున్న చీటింగ్ అని ఆరోపించాడు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. వెయింగ్ మెషీన్ లో సాంకేతిక సమస్య ఏర్పడిందని, దాంతో మైనస్ 70 అని ఉండడం, దానికితోడు కాంట్రాక్టు సిబ్బంది అవగాహనా లోపంతో లడ్డూ బరువుపై భక్తులు అపోహలకు లోనయ్యారని వివరించింది.

సాధారణంగా లడ్డూ కౌంటర్ల వద్ద ఇబ్బందులు ఎదురైతే అక్కడే ఉండే కౌంటర్ అధికారికి తెలియజేస్తే సమస్య పరిష్కారం అయ్యే వ్యవస్థ టీటీడీలో ఉందని స్పష్టం చేసింది. కానీ, ఆ భక్తుడు ఇవేవీ చేయకుండా తమపై ఆరోపణలు చేశాడని, ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరం అని టీటీడీ వెల్లడించింది.

శ్రీవారి లడ్డూ 160 నుంచి 180 గ్రాముల బరువు ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని టీటీడీ పేర్కొంది. బరువులో ఎలాంటి తేడా లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

పోటులో తయారుచేసే లడ్డూ ప్రసాదాల బరువును తప్పనిసరిగా అధికారులు తనిఖీ చేస్తారని, పూర్తి పారదర్శకతతో కూడిన ఈ తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే లడ్డూలు విక్రయ కౌంటర్లకు చేరతాయని టీటీడీ వివరించింది.

Leave a Reply

%d bloggers like this: