నేను ఆ మాట చెపితే కృష్ణగారు నవ్వేశారు: ముఖ్యమంత్రి కేసీఆర్!

నేను ఆ మాట చెపితే కృష్ణగారు నవ్వేశారు: ముఖ్యమంత్రి కేసీఆర్!
కృష్ణకు ఘన నివాళి అర్పించిన కేసీఆర్
వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయానన్న ముఖ్యమంత్రి
అల్లూరి సీతారామరాజు సినిమాను చాలా సార్లు చూశానని వెల్లడి

మన తెలుగు చలనచిత్ర సినీ రంగంలో సుప్రసిద్ధ సినీ నటులు కృష్ణగారు ఈరోజు మన మధ్య లేకుండా పోవడమనేది చాలా బాధాకరమైన విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని అన్నారు. కృష్ణగారి ఆతిథ్యం మేరకు ఈ ఇంటికి తాను చాలా సార్లు వచ్చానని తెలిపారు. విజయనిర్మల గారు కన్నుమూసినప్పుడు కూడా రావడం జరిగిందని చెప్పారు. కృష్ణకు నివాళి అర్పించిన అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎలాంటి అరమరికలు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కృష్ణ అని కేసీఆర్ అన్నారు. విలక్షణమైన నటుడని, పార్లమెంటు సభ్యులుగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. ‘అల్లూరి సీతారామరాజు’ గొప్ప సినిమా అని… ఈ సినిమా గురించి కృష్ణగారికి తాను చెపితే ఆయన నవ్వారని… కేసీఆర్ గారూ మీరు కూడా సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించారని చెప్పారు. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను తాను చాలా సార్లు చూశానని చెపితే… ఆయన ఎంతో సంతోషించారని అన్నారు.

దేశభక్తిని పెంపొందించేలా సినిమాలను తీసిన కృష్ణగారి గౌరవార్థం వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. మహేశ్ బాబు, ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పానని తెలిపారు. వారందరికీ ఈ దుఃఖాన్ని భరించేటటువంటి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు.

కృష్ణ పార్థివదేహం వద్ద భోరున విలపించిన మోహన్ బాబు

ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. కేసీఆర్, చంద్రబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేశ్, రామ్ చరణ్ తదితరులు నివాళి అర్పించారు. మరోవైపు కృష్ణ భౌతికకాయాన్ని చూసిన వెంటనే మోహన్ బాబు చలించిపోయారు. భోరున విలపించారు. శవపేటికను పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు కృష్ణనే తనను పైకి తీసుకొచ్చారని తెలిపారు. కృష్ణతో కలిసి 70కి పైగా సినిమాల్లో నటించానని, కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశానని చెప్పారు. కృష్ణగారి మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

 

కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన వెంకయ్యనాయుడు, చంద్రబాబు, కేటీఆర్ తదితరులు

Chandrababu paid tribute to Krishnas

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ నానక్ రాం గూడలోని కృష్ణ నివాసానికి ప్రముఖులు వరుస కడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేశ్ బాబు, నరేశ్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కృష్ణ నివాసంలో ఆయన భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు.

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, దర్శకులు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, మంచు విష్ణు తదితరులు కూడా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, వెంకటేశ్ చాలాసేపు మహేశ్ బాబు పక్కనే కూర్చొని ధైర్యం చెప్పారు. త్రివిక్రమ్.. మహేశ్ పక్కనే ఉన్నారు.  నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కృష్ణ నివాసంలోనే ఉండి ప్రముఖులను రిసీవ్ చేసుకుంటున్నారు.Leave a Reply

%d bloggers like this: