Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు…

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు… శరత్ చంద్రారెడ్డి భార్య కంపెనీ వివరాలు సేకరించిన ఈడీ!

  • జెట్ సెట్ గో పేరిట చార్టర్డ్ విమానాలను నడుపుతున్న కనికా రెడ్డి
  • అరెస్టైన శరత్ చంద్రారెడ్డి సతీమణే కనికా రెడ్డి
  • ఈ విమానాల్లోనే లిక్కర్ స్కాం ముడుపులు తరలాయని ఈడీ అనుమానం
  • జెట్ సెట్ గో వివరాలను అడిగిన ఈడీ
  • ఏఏఐ అందించిన ఈ వివరాలతోనే శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో మలుపు చోటుచేసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో కంపెనీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న శరత్ చంద్రారెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా శరత్ చంద్రారెడ్డి అర్ధాంగి కనికా రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న జెట్ సెట్ గో ఎయిర్ లైన్స్ కంపెనీకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని ఈడీ కోరిన విషయం బుధవారం వెలుగు చూసింది.

జెట్ సెట్ గో పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేసిన కనికారెడ్డి ప్రైవేట్ చార్టర్డ్ విమానాలను నడుపుతున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఈ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో చేతులు మారిన ముడుపులు కనికారెడ్డికి చెందిన జెట్ సెట్ గో విమానాల్లోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ తరలినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కంపెనీకి చెందిన విమానాల రాకపోకలు, ఆ విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను ఇవ్వాలంటూ ఏఏఐకి ఈడీ గత నెల 17ననే లేఖ రాసిందట. ఈ లేఖకు సరిపడ సమాచారాన్ని ఇప్పటికే ఈడీ అధికారులకు ఏఏఐ అందించినట్లు సమాచారం.

ఈ వివరాల ఆధారంగానే శరత్ చంద్రారెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కనికారెడ్డి కంపెనీ విమానాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతల అండతో పెద్ద ఎత్తున నగదును ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించినట్లుగా కూడా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, త్వరలోనే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలున్నట్లు విశ్లేషణలు సాగుతున్నాయి.

Related posts

బిజినెస్ వీసాపై వచ్చి ‘యాప్’లతో మోసాలు…

Drukpadam

కశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హత్యలో కొత్త ట్విస్ట్ .. తామే చేశామని ప్రకటించిన పీపుల్స్ ఫ్రంట్

Drukpadam

35 ఏళ్ల వయసున్న భార్యను హత్య చేయించిన వృద్ధుడు!

Drukpadam

Leave a Comment