విజయమే మన లక్ష్యం.. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంకండి: కమల్ హాసన్!

విజయమే మన లక్ష్యం.. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంకండి: కమల్ హాసన్!

  • ఎంఎన్ఎం పార్టీ జిల్లా నేతలతో కమల్ సమావేశం
  • బూత్ ల వారీగా పార్టీని బలోపేతం చేయాలని సూచన
  • పొత్తుల విషయాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని వ్యాఖ్య

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చెన్నైలోని అన్నానగర్ లో ఒక హోటల్లో జరిగిన పార్టీ రాష్ట్ర నిర్వాహకులు, జిల్లా నేతల సమావేశంలో ఆయన మార్గనిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా, లేక ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందా అనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. పొత్తులకు సంబంధించి సమావేశానికి హాజరైన నేతల నుంచి సూచనలను కూడా తీసుకున్నారు. బూత్ కమిటీల వారీగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మీడియాతో కమల్ మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని తమ నేతలకు సూచించామని చెప్పారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగుతామని తెలిపారు. మరోవైపు ఈసారి డీఎంకేతో కలిసి కమల్ ముందుకు సాగే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న ఐజేకే పార్టీ బీజేపీతో పొత్తుకు రెడీ అవుతుండటంతో.. ఆ స్థానంలో కమల్ పార్టీని స్టాలిన్ దగ్గరకు తీసుకునే అవకాశం ఉందని చెపుతున్నారు.

Leave a Reply

%d bloggers like this: