టీఆర్ యస్ తో పొత్తుపై ఇంకా ఒక క్లారిటీ లేదు… …సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని!
టీఆర్ యస్ తో పొత్తుపై ఇంకా ఒక క్లారిటీ లేదు… …సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని!
–కేసీఆర్ కలిసి పోటీచేద్దామని అంటున్నారు
–రాష్ట్రంలో 9 సీట్లపై కేంద్రీకరణ …పొత్తు లేకపోతె 9 సీట్లలో పోటీ
–అందులో ఖమ్మం జిల్లాలోనే 4 సీట్లు
–మునుగోడు ఎన్నికల వరకే టీఆర్ యస్ పొత్తు అనుకున్నాం
–ఎన్నికలప్పుడు పొత్తుల విషయం నిర్ణయిస్తాం
–పాలేరు లో ఎర్రజెండా ఎగరేస్తామని అనేక సార్లు అన్నాం
–ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరేస్తామని అంటున్నాం
–రాష్ట్ర కార్యదర్శి పోటీ చేయకుడనేది సిపిఎం నిర్ణయం
–ఎవరు పోటీచేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది
–ప్రజాసమస్యల పరిస్కారం కోసం రాజీలేని పోరాటాలు
టీఆర్ యస్ తో పొత్తుపై ఒక క్లారిటీ లేదని ,మునుగోడు ఎన్నికలవరకే టీఆర్ యస్ తో తమబంధమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు .బీజేపీ వ్యతిరేక పోరాటంలో టీఆర్ యస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేయాలని అభిప్రాయపడుతుందన్నారు . బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తామన్నారు .సిపిఎం గా మేమెప్పుడూ మా విధానాలను మార్చుకోలేదు …మొదటినుంచి బీజేపీ వల్ల దేశానికి , ప్రజలకు జరిగే నష్టాన్ని గురించి చెబుతున్నాం టీఆర్ యస్ ఆలస్యంగానైనా తెలుసుకొని మాతో కలిసి వస్తున్నందుకు సంతోషిస్తున్నామని తమ్మినేని అన్నారు .
సోమవారం ఖమ్మం జిల్లా సిపిఎం కార్యాలయం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కూడా బీజేపీ వ్యతిరేక పోరాటంలోను , ఎన్నికల్లో తమతో కలిసి ప్రయాణం చేయాలనీ భావిస్తున్నారని పేర్కొన్నారు . మునుగోడు ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాలు కొంత వేడెక్కాయని బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని, దానికి అడ్డుకట్ట వేసేందుకు సిపిఎం చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తుందని అన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నంలో భాగంగా కవులు , కళాకారులూ , మేథావులు , వివిధ రంగాలకు చెందినవారితో సదస్సులు ,సమావేశాలు నిర్వహించాలని తమ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించుకున్నామని తెలిపారు .
రాష్ట్రంలో ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని , కేంద్రమైన ,రాష్ట్రమైన ప్రజాసమస్యల పరిష్కరంలో ఉపేక్షిస్తే సహించేది లేదన్నారు . మునుగోడు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సీఎం కేసీఆర్ కు వివరించామని ఆయన సానుకూలంగా స్పందించారని తమ్మినేని తెలిపారు . అందులో పోడు భూముల సమస్యతో పాటు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య కూడా ఉందన్నారు . పోడుభూముల సమస్యపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలవల్ల మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉందన్న విషయాన్నీ సీఎం కు వివరించామన్నారు . ధరణి పోర్టల్ విషయంలో కూడా వస్తున్న ఇబ్బందులను , అధికారుల వైఖరిని తెలియజేయటం జరిగిందని పేర్కొన్నారు . ప్రజానుకూల నిర్ణయాలు , ప్రజారంజక పాలన అందించాలని సీఎం కు స్పష్టం చేశామన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం 9 సీట్లపై కేంద్రీకరణ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం రాష్ట్రంలో 9 అసెంబ్లీ సీట్లపై కేంద్రీకరించిందని, అందులో ఖమ్మం జిల్లాలోనే 4 సీట్లు ఉన్నాయన్నారు . పొత్తులు లేకపోతె రాష్ట్రంలో 9 సీట్లలో పోటీ చేస్తామని తమ్మినేని స్పష్టం చేశారు .మునుగోడు ఎన్నికల వరకే టీఆర్ యస్ కు తమ మద్దతు అనుకున్నాం .ఎన్నికల తర్వాత టీఆర్ యస్ కమ్యూనిస్టులతో కలిసి పోటీచేయాలని అంటుందని అందువల్ల ఎన్నికల నాటికీ పొత్తులపై ఒక రూపం వస్తుందన్నారు . ఇప్పుడు ఎన్నికల గురించి ఆలోచించడం తొందరపాటు అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు . పాలేరు లో ఎర్రజెండా ఎగరేస్తామని అంటున్నారు కదా ?అని విలేకర్లు ప్రశ్నించగా ఇప్పుడే కాదు అనేక సార్లు అన్నాం …ఇక్కడే కాదు ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరేస్తామని అంటున్నాం ఎర్రజెండా ఎగరాలనేదే మా తపన అన్నారు. ఎన్నికల్లో మీరు పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారా ? అని ప్రశ్నించగా ,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల్లో పోటీ చేయకూడదు , ఎవరు పోటీచేస్తారనేది పార్టీ నిర్ణయిస్తుంది అంతేగానీ వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని తమ్మినేని అన్నారు . అసలు పొత్తులు ఉంటాయా ? ఉంటె ఎన్ని సీట్లలో పార్టీ పోటీ చేస్తుంది..అనేదానిపై చర్చించలేదని అన్నారు. మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్,సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు , నాయకులూ యర్రా శ్రీకాంత్ , వీరభద్రం , విక్రమ్ లు పాల్గొన్నారు.