కళాతపస్వి విశ్వనాథ్‌ను కళ్లకు అద్దుకున్న దిగ్గజ నటుడు కమల హాసన్!

కళాతపస్వి విశ్వనాథ్‌ను కలిసిన కమల్.. విశ్వనాథ్ చేయిని ఆప్యాయంగా కళ్లకు అద్దుకున్న దిగ్గజ నటుడు!

  • హైదరాబాద్‌ వచ్చిన కమల హాసన్
  • విశ్వనాథ్ ఇంటికెళ్లి కలిసిన కమల్
  • వీరిద్దరి కాంబోలో సూపర్ హిట్ సినిమాలు
  • విశ్వనాథ్ ఆరోగ్యంపై కమల్ ఆరా

దిగ్గజ నటుడు కమల హాసన్ మరో దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో క్లాసిక్స్ అనదగ్గ సినిమాలు వచ్చాయి. 1985లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘స్వాతిముత్యం’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీని సైతం దక్కించుకుంది. ‘స్వాతిముత్యం’ సినిమాకు పలు జాతీయ అవార్డులు కూడా లభించాయి. ఇంకా వీరి కాంబినేషన్‌లో ‘సాగరసంగమం’, ‘శుభసంకల్పం’ వంటి ఉత్తమ చిత్రాలు వచ్చాయి.

తాజాగా, హైదరాబాద్ వచ్చిన కమల హాసన్ నేరుగా కళాతపస్వి ఇంటికెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతిని అందుకుని తన కళ్లకు అద్దుకుని ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ ఆరోగ్యం గురించి కమల్ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కమల హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, గురువుగారిని వాళ్లింట్లో కలిశానని, ఎన్నో మధురస్మృతులను గుర్తుచేసుకున్నామనీ, వారంటే ఎంతో గౌరవమనీ కమల్ పేర్కొన్నారు.

ఈ ఫొటోకు ఇప్పటికే 2 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇక, కామెంట్స్‌కైతే లెక్కేలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ట్రెండ్ సెట్టర్ అయ్యాయని కొందరంటే, తమ ఫేవరెట్ సినిమాలన్నీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చినవేనని మరికొందరు పేర్కొన్నారు. ఒకరు లెజండరీ నటుడైతే, మరొకరు లెజండరీ దర్శకుడని ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిద్దరినీ ఇలా చూడడం చాలా బాగుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: