Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మూడు రాజధానులతో విద్వేషాలు తప్ప ఉపయోగం లేదు: సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ!

మూడు రాజధానులతో విద్వేషాలు తప్ప ఉపయోగం లేదు: సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ!

  • విశాఖలో ‘ఆంధ్రుడా మేలుకో’ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీనారాయణ
  • మహారాష్ట్రలా ప్రతి జిల్లాను రాజధానిలా అభివృద్ధి చేస్తే సమస్యే ఉండదన్న సీబీఐ మాజీ జేడీ
  • మహారాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం ఎక్కడికీ వెళ్లరన్న లక్ష్మీనారాయణ
  • మనవాళ్లు మాత్రం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆవేదన

ఏపీ ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు తప్ప దీనివల్ల ఒనగూరేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు. విశాఖపట్టణం జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆంధ్రుడా మేలుకో’ కార్యక్రమానికి హాజరైన ఆయన మద్దతు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు ప్రియాంకరావు, జగన్ మురారి తమ డిమాండ్లను లక్ష్మీనారాయణకు వివరించారు. 

వారి డిమాండ్లతో ఏకీభవిస్తున్నట్టు చెప్పిన లక్ష్మీనారాయణ అనంతరం మాట్లాడుతూ.. మహారాష్ట్రలా ప్రతి జిల్లాను ఒక రాజధానిగా అభివృద్ధి చేస్తే ప్రాంతాల మధ్య విద్వేషాలకు తావుండదన్నారు. అక్కడ తాను 22 సంవత్సరాలు పనిచేశానన్నారు. ఆ అనుభవంతోనే ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. ముంబై, పూణె, థానే, ఔరంగాబాద్, నాగ్‌పూర్, నాసిక్ చుట్టూ ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు పెరిగాయని అన్నారు. అక్కడి ప్రజలు ఉద్యోగాల కోసం బయటి రాష్ట్రాలకు వెళ్లరని అన్నారు. మన వాళ్లు మాత్రం ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారని పేర్కొన్నారు. 

ఏపీలోనూ ప్రతి జిల్లాను ఇలాగే తీర్చిదిద్దితే మనకు కూడా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. తమిళనాడులోనూ ప్రతి జిల్లా ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్తోందన్నారు. మహారాష్ట్ర తరహాలో అమరావతిలో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ పెట్టి విశాఖ, కర్నూలులో బెంచ్‌లు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని న్యాయపరమైన సమస్యలను అక్కడే పరిష్కరించుకునే వీలుంటుందని అన్నారు. 

నాగ్‌పూర్‌లో శీతాకాల సమావేశాలు జరుగుతున్నట్టే ఏపీలోనూ విశాఖ, కర్నూలులో శీతాకాల సమావేశాలు పెట్టుకోవచ్చన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని పెట్టాలంటున్నారని, దీనివల్ల రాయలసీమకు కూడా రాజధాని కావాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇలాంటి డిమాండ్ల వల్ల ప్రాంతాల మధ్య విద్వేషాలు తప్ప మరేమీ ఉండదని లక్ష్మీనారాయణ అన్నారు.

Related posts

శాశ్వత అధ్యక్షుడి విషయంలో వైసీపీ వెనకడుగు !

Drukpadam

ఆళ్ళ… షర్మిల వద్దకు జగన్ దూతగా వెళ్ళారా  …?

Drukpadam

100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. ఖమ్మం బీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు!

Drukpadam

Leave a Comment