ఆస్ట్రేలియా అమ్మాయిని భారతీయ వ్యక్తి ఎందుకు హత్య చేశాడంటే…!

ఆస్ట్రేలియా అమ్మాయిని భారతీయ వ్యక్తి ఎందుకు హత్య చేశాడంటే…!
2018లో ఆస్ట్రేలియా అమ్మాయి హత్య
క్వీన్స్ లాండ్ బీచ్ లో శవమై తేలిన టోయా
భారత్ కు పారిపోయి వచ్చిన రజ్వీందర్ సింగ్
తాజాగా ఢిల్లీలో అరెస్ట్
త్వరలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అప్పగింత

ఆస్ట్రేలియాలో ఓ యువతిని హత్య చేసి, భారత్ కు పారిపోయిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ యువతిని అతడు ఎందుకు చంపాడో నాలుగేళ్ల తర్వాత కారణం వెల్లడైంది.

2018లో క్వీన్స్ లాండ్ లో రజ్వీందర్ సింగ్ అనే భారతీయ వ్యక్తి… బీచ్ లో టోయా కార్డింగ్లే అనే అమ్మాయిని కడతేర్చాడు. హత్య చేసిన రెండ్రోజుల తర్వాత రజ్వీందర్ ఆస్ట్రేలియా నుంచి పరారయ్యాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అతడిపై రూ.5.50 కోట్ల నజరానా ప్రకటించింది. అతడిని పట్టించడంలో సాయపడాలంటూ భారత కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరింది.

ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని జీటీ కర్నాల్ రోడ్డు వద్ద రజ్వీందర్ సింగ్ ను స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. కాగా, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఆసక్తికర సంగతులు వెల్లడించారు.

రజ్వీందర్ సింగ్ ఇన్నిస్ ఫాయిల్ లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేవాడు. హత్య జరిగిన రోజున రజ్వీందర్ సింగ్ భార్యతో గొడవపడి బీచ్ కు వెళ్లాడు. ఓ ఫార్మసీ వర్కర్ అయిన టోయా అదే సమయంలో తన కుక్కతో షికారుగా బీచ్ కు వచ్చింది. అక్కడే ఉన్న రజ్వీందర్ ను చూసి కుక్క అరవడం మొదలుపెట్టింది. దాంతో ఆగ్రహానికి గురైన రజ్వీందర్ సింగ్…. కుక్క యజమాని టోయాతో వాగ్వాదానికి aదిగాడు.

అనంతరం ఆవేశంతో తన వద్ద ఉన్న కత్తితో టోయాను పొడిచి చంపాడు. ఆమె మృతదేహాన్ని ఇసుకలో పూడ్చివేసి, కుక్కను అక్కడే ఓ చెట్టుకు కట్టేసి పరారయ్యాడు. అరెస్ట్ భయంతో ఉద్యోగం వదిలేసి, భార్య, ముగ్గురు పిల్లలను కూడా వదిలేసి భారత్ కు పారిపోయి వచ్చాడు.

అతడి అరెస్ట్ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇంటర్ పోల్ ను అప్రమత్తం చేసింది. రజ్వీందర్ సింగ్ ను అరెస్ట్ చేయడం కోసం ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఈ నెల 21న అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రజ్వీందర్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో త్వరలోనే అతడిని క్వీన్స్ లాండ్ పోలీసులకు అప్పగించనున్నారు.

Leave a Reply

%d bloggers like this: