గిరిజనలు తమకు నచ్చిన ప్రాంతాల్లో నివసించే హక్కు లేదా ?

 గిరిజనలు తమకు నచ్చిన ప్రాంతాల్లో నివసించే హక్కు లేదా ?
-పోడు హక్కులకోసం పోరుతప్పదంటున్న గిరిజన సంఘాలు
-ఎర్రబోడులో గిరిజనులకు నోటీసులు ఇవ్వడంపై మండిపాటు
-రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాస్తే సహించమంటున్న కోయలు
-అడవి బిడ్డలకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలను ఆశ్రమిస్తామంటున్న గొత్తికోయలు
-నివసించే హక్కును కాలరాస్తారా ? అంటూ ఆగ్రహం

జబ్బు ఒకటైతే …మందు ఒకటి ఇచ్చినట్లుగా ఉంది గొత్తికోయల విషయంలో పాలకులతీరు .గిరిజనులకు తమకు నచ్చిన ప్రాంతాల్లో నివసించే హక్కు లేదా ? అంటే అందుకు పౌర హక్కుల సంఘాలు గిరిజన సంఘాలు భూమిపుత్రులకు కచ్చితంగా ఆ హక్కు ఉందని అంటున్నారు . ఒకప్పుడు గోండ్వానా రాజ్యంలో ఉన్న కోయలు ,ఉమ్మడి ఏపీ , ఛత్తీస్ ఘడ్ , మహారాష్ట్ర, ఒడిస్సా , ప్రాంతాలలలో ఉన్న ( గోండ్వానా రాజ్యం) ఏజన్సీ లో పోడువ్యవసాయం చేసుకొని ఉంటున్నారు . అప్పటి గోండ్వానా లో సుమారు కోటి మంది వరకు గిరిజన ఉన్నారని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే లంబాడీలు కాకుండా 9 తెగలకు చెందిన కోయలు సుమారు 15 లక్షలవరకు ఉన్నారని అంచనా . దేశానికి స్వతంత్రం రాకపూర్వమే వీరు అటవీ ప్రాంతంలో నాగరిక ప్రపంచానికి దూరంగా ఉంటున్నందున రాజ్యాంగ నిర్మాతలు వీరికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు. రాజ్యాంగంలోని 5 వ షడ్యూల్ లో 5 (ఇ) 19 (డి ) ప్రకారం కోయజాతి ఏజన్సీ లో ఎక్కడికైనా సంచరించే హక్కు ఉంది . ఏజన్సీలోని అటవీ భూములను 4 హెక్టార్ల వరకు పోడు వ్యవసాయం చేసుకొనే అవకాశం కల్పించారు. కానీ ప్రస్తుతం పాలకులు వాటికీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు . గిరిజనుల పేరుతో గిరిజనేతరులు పోడు వ్యవసాయం చేస్తూ భూమిపై హక్కులను కోరడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఖండించారు .అయితే అదే సందర్భంలో గుత్తికోయలు ఇక్కడివాళ్ళు కాదని వారిని పంపాల్సిందేనని ఇదే కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడంపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. టీఆర్ యస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పోడుభూముల జోలికి వచ్చిన అధికారులను తన్ని తరిమేయండి , తిరగబడండి అని పిలుపు ఇచ్చిన సందర్భాలు మర్చిపోరాదు.

 

అటవీ ప్రాంతంలో తరతరాలుగా జీవిస్తూ భూమి పుత్రులుగా పిలవబడుతున్న కోయలు , లేదా గొత్తికోయల విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై పలు విమర్శలు ఉన్నాయి. అడవిని నమ్ముకొని సంచార జాతులుగా జీవనం సాగిస్తున్న కోయలు లేదా గొత్తికోయలు , కొండరెడ్లు ,గోండులు ,చెంచులు , ప్రార్దనులు,తోటి ,అంగ్,కొలాం,నాయకపోడు లు లాంటి 9 తెగలకు చెందినవారు వేలాది సంవత్సరాలుగా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు . వీరికి నాగరిక ప్రపంచంతో సంబంధం లేదు . చిన్న చిన్న గుడిశల్లో గుంపులు ,గుంపులుగా జీవనం సాగిస్తున్నారు . బాహ్యప్రపంచంతో వీరికి సంబంధాలు తక్కువ. విద్య , వైద్యం అందుబాటులో ఉండవు . విద్యుత్ సౌకర్యం ఉండదు. పూరిగుడిశెలే వారికీ అందమైన బంగ్లాలు . అందుకే కొన్ని ప్రత్యేక హక్కులు వీరికి రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను పాలకులు కాలరాస్తున్నారనే విమర్శలు ఉన్నాయి . దీనికి తోడు గిరిజనేతరులు వీరు పేరు చెప్పుకొని వందల ఎకరాలు పోడు సాగు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క తెలంగాణలోనే 4 లక్షల 50 వేలమంది 13 లక్షల ఎకరాల పోడుభూములు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు .ఇందులో అర్హులు ఎంతమంది ఉన్నారనే దానిపై కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే దీనిపై సర్వే జరిపిన ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదిక చూసిన అధికారులు ఆవాక్కు అయినట్లు సమాచారం …

అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతరులు తమకు పోడు వ్యవసాయం మీద హక్కులు కల్పించాలనే డిమాండ్ తో ముందుకు వస్తున్నారు . దీనిపై రాష్ట్రప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. గిరిజన సంఘాలు మాత్రం గిరిజనులకు హక్కు ప్రకారం 10 ఎకరాలు ఇవ్వాలని అందువల్ల బెండాలపాడు అడవుల్లోని ఎర్రబోడులో ఉంటున్న 40 కుటుంబాలకు 10 ఎకరాల చొప్పున ఇచ్చినప్పటికీ అక్కడ మరో 250 ఎకరాల పోడు భూమి ఉంటుందని దాన్ని అటవీశాఖ ప్లాంటేషన్ కోసం తీసుకోవచ్చునని చెంచు రామకృష్ణ అనే గిరిజనసంఘాల నేత అంటున్నారు .ఎర్రబోరులో ఫారెస్ట్ రేంజర్ హత్యను తాముకూడా ఖండిస్తున్నామని,హంతకులను శిక్షించాల్సిందేనని చెబుతున్నారు . కానీ ఆపేరుతో గిరిజనులను ఖాళీ చేయించాలనే ప్రయత్నాలను అండ్డుకుంటామని అన్నారు . వారికీ ఆధార్ కార్డులు , ఓటర్ ఐడి ఉన్నాయని అయినప్పటికీ వారిని అక్కడ నుంచి ఖాళీ చేయాలనీ నోటీసులు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని అంటున్నారు రామకృష్ణ . అదే సందర్భంలో ఎర్రబోడులో నివసిస్తున్న గొత్తికోయలు తాము 2002 ఇక్కడకు వచ్చామని అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నామని అందువల్ల ఇక్కడనుంచి వెళ్లడం అనేది జరిగితే తమ శవాలు వెళ్లాల్సిందే కానీ తాము వెళ్ళేది లేదని తెగేసి చెబుతున్నారు . దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.

ఎర్రబోడు పరిణామాల అనంతరం ఫారెస్ట్ సిబ్బంది తమకు పోలీస్ స్టేషన్ల లాగా ,ఫారెస్ట్ స్టేషన్లు మంజూరి చేయాలనీ ఆయుధాలు ఇవ్వాలని లేకపోతె తాము విధులకు హాజరుకాబోమని చెపుతున్నారు . ఈ విషయాన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి , రాష్ట్ర పోలీస్ బాస్ మహేందర్ రెడ్డికి తెలిపామని అంటున్నారు . తగిన రక్షణ కల్పించకపోతే తాము విధులు నిర్వర్తించలేమని అంటున్నారు . చూద్దాం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరి …!

Leave a Reply

%d bloggers like this: