ప్రగతి భవన్ కు షర్మిల యాత్ర …హైద్రాబాద్ లో హైడ్రామా..!

ప్రగతి భవన్ కు షర్మిల యాత్ర …హైద్రాబాద్ లో హైడ్రామా..!
-షర్మిల అరెస్ట్ …పలు సెక్షన్లకింద కేసులు నమోదు
-నిన్న వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్రపై దాడి …
-పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-షర్మిల పాదయాత్రకు అనుమతించాలంటూ వైఎస్సార్టీపీ లంచ్ మోషన్ పిటిషన్
-నర్సంపేట పోలీసులు యాత్రకు అనుమతి నిరాకరించారంటూ ఆరోపణ
-టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని కోర్టుకు నివేదన
-అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు సూచన

నిన్న వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్ర పై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం హైద్రాబాద్ లో షర్మిల సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ కు రాళ్లదాడిలో దెబ్బతిన్న తన కార్ తో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరారు . దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఆమె కార్ ను అడ్డుకున్నారు .ఫలితంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న ఆరోపణల కింద ఐపీసీ 353, 333, 337 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అయ్యింది. మొత్తంగా పంజాగుట్ట నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దాకా షర్మిలను తరలిస్తున్న క్రమంలో హైడ్రామా నెలకొంది.

ఆమెను కార్ లో నుంచి దించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు . ఆమె కార్ లోనే ఉండగానే ట్రాఫిక్ వాహనాలను క్లియర్ చేసే వాహనం ద్వారా ఆమెను వెహికిల్ తోసహా ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు .అక్కడ కార్ అద్దాలు బ్రేక్ చేసి ఆమెని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ సందర్భంగా వైఎసార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు ఒక భవనం ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు . వారిని పోలీసులు చాకచక్యంతో కిందకు దించారు. తల్లి విజయమ్మ లోటస్ పాండ్ నుంచి పోలీస్ స్టేషన్ కు వచ్చేందుకు బయలుదేరు తుండగా ఆమెను సైతం ఇంటివద్దని నిర్బంధించారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని షర్మిలను కలిశారు .

పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాదయాత్రలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని షర్మిలకు కోర్టు సూచించింది. సీఎం కేసీఆర్ పై ఎలాంటి రాజకీయ పరమైన, మతపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు షరతు విధించింది.

3,500 కిలో మీటర్ల మేర ప్రశాంతంగా సాగిన షర్మిల పాదయాత్రకు వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసులు అనుమతి నిరాకరించారని వైఎస్సార్టీపీ తన పిటిషన్ లో ఆవేదన వ్యక్తం చేసింది. వరంగల్ జిల్లా లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు యాత్రపై దాడికి యత్నించారని ఆరోపించింది. ఈ పిటిషన్ పై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు… షర్మిల పాదయాత్రకు అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న బ్రదర్ అనిల్ కుమార్

ఈ నేపథ్యంలో, షర్మిల భర్త, ప్రముఖ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతోందో తెలుసుకుంటానని, లోపలికి వెళ్లనివ్వకపోవడానికి తానేమీ క్రిమినల్ ను కాదని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. లోపాలు ఎత్తిచూపామని, ఎవరు రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇందులో వ్యక్తిగత అజెండా ఏముంటుందని అనిల్ కుమార్ ప్రశ్నించారు. పాదయాత్ర చేయడం తప్పేమీ కాదని, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టం చేశారు.

గృహ నిర్బంధంలో వైఎస్ విజయమ్మ… పోలీసుల చర్యకు నిరసనగా దీక్షకు దిగిన షర్మిల తల్లి

ఈ నేపథ్యంలో కుమార్తె వద్దకు బయలుదేరిన వైఎస్ విజయమ్మను లోటస్ పాండ్ లోని ఆమె ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లోటస్ పాండ్ లో పోలీసులతో విజయమ్మ తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగారు.

తన కుమార్తెను చూసేందుకు వెళితే మీకొచ్చిన ఇబ్బందేమిటని ఆమె పోలీసులను నిలదీశారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కు తగ్గకపోవడంతో… పోలీసుల చర్యను నిరసిస్తూ విజయమ్మ తన ఇంటిలోనే నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పోలీసుల ఎదుటే ఆమె దీక్షకు దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

షర్మిల కారులో ఉండగానే… ఆ కారును లాక్కెళ్లడం దారుణం: కిషన్  రెడ్డి…

షర్మిల వున్న కారును క్రేన్ తో పోలీసులు తరలిస్తున్న వీడియోను పోస్ట్ చేసిన కిషన్ రెడ్డి… ఓ మహిళ అని కూడా చూడకుండా షర్మిలను… కారులో ఉండగానే… ఆ కారును క్రేన్ తో లాక్కెళ్లడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ మహిళ పట్ల కేసీఆర్ సర్కారు విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శించిందని, ఇదో హేయమైన చర్య అని ఆయన అన్నారు. ఈ చర్యను తాను ఖండిస్తున్నానన్న కిషన్ రెడ్డి… విపక్షాల గొంతు నొక్కడం కేసీఆర్ కు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు.

ఓ ఆడబిడ్డపై ఇలాంటి దాడులా?… షర్మిలపై దాడి పట్ల కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పందన

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల వాహనంపై వరంగల్ జిల్లాలో దాడి జరగడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈ దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు.

ఓ ఆడబిడ్డపై ఈ విధంగా దాడులా? ఇదా సంస్కృతి? అని ప్రశ్నించారు. ఏం… ఓ ఆడబిడ్డ పార్టీ అధ్యక్షురాలిగా ఉండకూడదా? ఆమె యాత్రను అడ్డుకోవడం ఎందుకు? అని జీవన్ రెడ్డి నిలదీశారు. ఒకవేళ ఆమె ఏమైనా విమర్శలు చేసుంటే న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలే కాని, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు.

ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అనుమతించకపోవడం ఏంటని అన్నారు. అధికార పక్షం దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం గర్హనీయం అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుని, విగ్రహ పునఃప్రతిష్టాపన చేయాలని డిమాండ్ చేశారు.

 

 

Leave a Reply

%d bloggers like this: