లోకేష్ ని చంపాలని టార్గెట్ చేశారు …చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు …!

నన్ను చంపొచ్చనుకున్నారు.. ఇప్పుడు లోకేశ్ ని టార్గెట్ చేశారట: చంద్రబాబు

  • జగన్ గెలిస్తే పిడిగుద్దులు ఉంటాయని అప్పుడే చెప్పానన్న చంద్రబాబు
  • రివర్స్ టెండరింగ్ తో పోలవరంను గోదావరిలో ముంచేశారని విమర్శ
  • జగన్ కు పోలీసులుంటే.. తనకు ప్రజలు ఉన్నారన్న బాబు

వైయస్ వివేకా హత్య కేసు సీబీఐ విచారణను హైదరాబాద్ కు సుప్రీంకోర్టు బదిలీ చేయడం జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. వివేకాను ఎవరు, ఎందుకు చంపారనే విషయం వెలుగులోకి రావాలన్నారు. ఈ విషయంపై జగన్ ఇంత వరకు స్పందించలేదని విమర్శించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పరిధిలోని విజయరాయిలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాదయాత్రలో ప్రజలకు జగన్ ముద్దులు పెడుతున్నారని… గెలిచిన తర్వాత పిడిగుద్దులు ఉంటాయని తాను అప్పుడే చెప్పానని… తాను చెప్పిందే ఇప్పుడు జరుగుతోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా జరుగుతున్నది చూస్తున్నారని చెప్పారు. ప్రజలు ఇప్పుడైనా తన మాట వింటారని… ఇప్పుడు కూడా వినకపోతే రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం అవుతుందని అన్నారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని, ముఖ్యమంత్రిగా పని చేశానని… ఇప్పుడు తనకు ఎమ్మెల్యే పదవితో పని లేదని చెప్పారు. ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలని… భయపడితే అది మనల్ని చంపేస్తుందని అన్నారు.

టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని… గేట్లు పెట్టేంత వరకు పనులు పూర్తి చేయించానని చంద్రబాబు తెలిపారు. జగన్ సీఎంగా ప్రమాణం చేసిన రోజునే రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరంను గోదావరిలో ముంచేశాడని విమర్శించారు. పోలవరం పూర్తి కాకపోవడానికి కూడా తానే కారణమని అంటున్నారని… ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని అన్నారు. గోదావరి జిల్లాల్లో కూడా పంట విరామం ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. మూడున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఒకే ఒక పని అమాయకులపై కేసులు పెట్టించి వేధించడమని దుయ్యబట్టారు.

బాబాయ్ ని చంపినంత ఈజీగా తనను కూడా చంపొచ్చని అనుకున్నారని… ఇప్పుడు తన కుమారుడు లోకేశ్ ని టార్గెట్ చేసుకున్నారట అని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని అన్నారు. జగన్ కు పోలీసులు ఉంటే… తనకు ప్రజలు ఉన్నారని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: