లిక్కర్ స్కాంతో నాకు సంబంధంలేదు: ఏపీ ఎంపీ మాగుంట!

లిక్కర్ స్కాంతో నాకు సంబంధంలేదు: ఏపీ ఎంపీ మాగుంట!
-అమిత్ అరోరా ఎవరో తెలియదన్న వైసీపీ నేత
-రిమాండ్ రిపోర్టులో తన పేరు చేర్చడంతో ఆశ్చర్యపోయానని వెల్లడి
-మద్యం వ్యాపారాలు గతంలోనే మానేశామని వివరణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఎలాంటి పాత్ర లేదని వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో తన పేరు చేర్చడంతో ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. గతంలో తాము మద్యం వ్యాపారాలు చేసిన మాట
వాస్తవమేనని, అయితే, ఆ వ్యాపారాలను మానేసి చాలాకాలం అయిందని వివరించారు. ప్రస్తుతం వెలుగు చూసిన స్కాంలో అమిత్ అరోరా పాత్ర కీలకమని ఈడీ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, అమిత్ అరోరా అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని మాగుంట చెప్పారు. అతనితో కనీసం తనకు ముఖ పరిచయం కూడా లేదన్నారు.

అమిత్ అరోరా కస్టడీ కోరుతూ బుధవారం కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల పేర్లను ప్రస్తావించారు. దీనిపై మాగుంట గురువారం నాడు స్పందించారు. లిక్కర్ స్కాంతో తనకు గానీ, తన కుటుంబానికి గానీ సంబంధంలేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ విషయంపై మీడియా ముందు స్పష్టతనిస్తానని ఎంపీ మాగుంట తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: